గేమింగ్ జోన్ లో ప్రమాదం యాజమాని మృతి
డీఎన్ఏ పరీక్షలో వెల్లడి వివరాలు వెల్లడించిన పోలీసులు
గాంధీనగర్: రాజ్ కోట్ గేమింగ్ జోన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో యజమాని ప్రకాశ్ హీరాన్ జైన్ కూడా మరణించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యుల డీఎన్ ఏలతో పోల్చి మృతులను నిర్ధరిస్తున్నారు. ఈ విషయంలో ప్రకాశ్ జైన్ మృతి చెందినట్లు ధృవీకరించారు. జైన్ తల్లి విమాలా దేవి డీఎన్ ఏతో మృతదేహం డీఏఎన్ నమూనా సరిపోలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రకాశ్ జైన్ రాజస్థాన్ కు చెందినవాడన్నారు. నాలుగైదేళ్లుగా రాజ్ కోట్ లో నివసిస్తున్నాడని తెలిపారు. గేమింగ్ జోన్ లో రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టాడని ఇతనికి 60 శాతం వాటా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో ఆరుగురు నిందితులలో నాలుగో నిందితుడు ధవల్ థక్కర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారకులైన యువరాజ్ సింగ్ సోలంకి, నితిన్ జైన్, రాహుల్ రాథోడ్ లను పోలీసులు గతంలోనే అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో 12 మంది చిన్నారులతో సహా 30 మంది మృతి చెందారు. కాగా బుధవారం వరకు 25 మృతదేహాల డీఎన్ ఏ పరీక్షలు పూర్తి అయినట్లు పోలీసులు తెలిపారు.