ఉభయ సభల్లో కొనసాగుతున్న నిరసనల పర్వం
The ongoing protests in both houses
విపక్షాలపై మండిపడ్డ బీజేపీ ఎంపీలు
హరియాణా, మహారాష్ర్ట ఓటమితో కుంగిపోయారు: ఎంపీ రవికిషన్
దేశంలో కాంగ్రెస్, కూటమి మనుగడ కష్టమే: ఎంపీ దినేష్ శర్మ
ఫెయింజల్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని డీఎంకే వినతి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్, రాజ్యసభల్లో నిరసనల పర్వం గురువారం కూడా కొనసాగింది. దీంతో బీజేపీ ఎంపీలు ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. అదానీ కేసు, సంభాల్, మణిపూర్ హింస, వరద నష్టాలపై చర్చించాలని విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. నిరసనలతో హోరెత్తించాయి. భారీ నిరసనలతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
బీజేపీ ఎంపీ రవికిషన్ విపక్షాల తీరుపై మండిపడ్డారు. ఇంతమంది కలిసి సభను సజావుగా కొనసాగించేందుకు అనుమతించడం లేదన్నారు. విపక్ష పార్టీలకు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం లేదన్నారు. ఓ వైపు సమస్యలపై చర్చించేందుకు సమయం ఇచ్చినా, అంశాల వారీగా కాకుండా ఇప్పుడే చర్చించాలని పట్టుబట్టడం వారి అవివేకమన్నారు. ఇప్పటికే విపక్ష పార్టీ కూటమి హరియాణా, మహారాష్ర్టలో ఓటమితో కుంగిపోతుందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. దీంతో ప్రభుత్వంపై నిందలువేయాలని, వేలెత్తిచూపాలని ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ఎంతమంది ఏం చేసినా తమ ప్రభుత్వానికి ప్రజాశీర్వాదం ఉన్నంతవరకూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. భవిష్యత్ లోనూ విపక్షాలకు మనుగడ లేదన్నారు.
బీజేపీ ఎంపీ దినేష్ శర్మ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగ పుస్తకంతో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడడం విడ్డూరకరమన్నారు. సంభాల్ వెళ్లే పేరుతో తన ఫోటో సెషన్ ను పూర్తి చేసుకున్నారని అక్కడి ప్రజలపై ఎలాంటి సానుభూతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు కోసమే రాహుల్ చరిష్మా చేస్తున్నా, ఆయన కుయుక్తులను ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారని విమర్శించారు. కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీస్తూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
మరోవైపు సమావేశాల్లో పాల్గొనేందుకు ఎంపీ ప్రియాంక గాంధీ కూడా గురువారం పార్లమెంట్ కు వచ్చారు. డీఎంకే ఎంపి రాజ్యసభలో మత్స్యకారులు, ఫెయింజల్ తుపాను నష్ట సహాయం కింద వెంటనే రూ. 2వేల కోట్లను విడుదల చేయాలని కోరారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని సత్వరమే తమిళనాడుకు పంపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.