కారు దిగి కాంగ్రెస్‌లోకి మేయర్
ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి యాదాద్రి పునర్నిర్మాణంలో రూ. 400 కోట్ల అవినీతి ఆరోపించిన ఎమ్మెల్సీ పురాణం సతీష్ బీఆర్ఎస్ను వీడనున్న కాలేరు వెంకటేష్?
నా తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే కేశవరావు తో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మీకి కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, కుమార్తె విజయలక్ష్మిలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. తన రాజకీయ శేష జీవితం ఇక కాంగ్రెస్‌కే అంకితమని ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి కడియంశ్రీహరి, ఆయన కుమార్తె దివ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పురాణం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఇంతకాలం బానిస సంకెళ్లలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, తెలంగాణ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. యాదాద్రి పునర్నిర్మాణంలో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కుటుంబ పాలనతో కేటీఆర్, హరీశ్‌రావులు తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లని చేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆకాంక్షించారు. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్కూడా కారు దిగి హస్తాన్ని అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నేతలతో ఆ దిశలో ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మార్పిడిపై ప్రకటిస్తారని తెలుస్తోంది.