అరుణాచల్​పై విషం గక్కిన డ్రాగన్​

ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమే భారత్​కు అమెరికా సమర్థన సరిహద్దుల్లో అలజడితో తీవ్ర పరిణామాలు భారత్​కే మద్ధతిస్తామని స్పష్టం చేసిన రక్షణ శాఖ

Mar 21, 2024 - 18:42
 0
అరుణాచల్​పై విషం గక్కిన డ్రాగన్​

నా తెలంగాణ, ఢిల్లీ: అరుణాచల్​లోని జాంగ్నాన్​ తమదేనని, సేలా సొరంగాన్ని భారత్​ చట్టవిరుద్ధంగా చేపట్టిందని మరోసారి చైనా విషం గక్కింది. దీనిపై భారత్​చైనాకు గట్టి సమాధానం చెప్పింది. చైనా ప్రకటన పూర్తి అసంబద్ధమైనదని, అరుణాచల్ ​ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమేనని శుక్రవారం మరోమారు స్పష్టం చేసింది. కాగా భారత్​ ప్రకటనను అమెరికా సమర్థించింది. తాము అరుణాచల్​ప్రదేశ్​ను భారత్​లో అంతర్భాగంగానే గుర్తిస్తున్నామని ఈ విషయంలో చైనా వాస్తవాధీనరేఖ అవతల ఆక్రమణలకు పాల్పడితే ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్​ పటేల్​స్పష్టం చేశారు. అరుణాచల్ ​వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి ప్రయత్నాలనైనా అమెరికా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో భారత్​ వెంట ఉంటామని స్పష్టం చేసింది. అరుణాచల్​ను దక్షిణ టిబెట్​గా పేర్కొంటూ చైనా పసలేని మొండి వాదనకు, వార్తలకు, ప్రకటనలకు దిగుతోంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు భారత్​ అంతర్జాతీయ సమాజంలో చైనాను నిలదీసినా ఆ దేశ ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇక ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేలా సొరంగాన్ని ప్రారంభించడంతో చైనా ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది. మరోవైపు ప్రధాని భూటాన్ ​పర్యటన 21, 22న చేపట్టనుండగా, అక్కడి ఎయిర్​పోర్ట్​లో అననుకూల వాతావరణం కారణంగా పర్యటన రద్దయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. తిరిగి ఎప్పుడు పర్యటన చేపడతారనే విషయాన్ని ఇరుదేశాల విదేశాంగ శాఖాధికారులు నిర్ణయించి వెల్లడిస్తారని స్పష్టం చేశాయి. ప్రధాని భూటాన్​ పర్యటనపై కూడా చైనాలో కలవరపాటు మొదలైన విషయం తెలిసిందే.