రుచికి తాళం  టమోటా ధరలు పైపైకి

కిలోకు రూ. 50 నుంచి 100 పలుకుతున్న టమోటా

Jun 21, 2024 - 17:42
 0
రుచికి తాళం  టమోటా ధరలు పైపైకి

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: టమోటా ధరలు నోటి రుచికి తాళం వేయిస్తున్నాయి. 17 రాష్ట్రాల్లో రూ.50 నుంచి రూ. 100 వరకు కిలోకు ధరలు పెరిగాయి. దీంతో ప్రతీవంటకాల్లోనూ టమోటాలను వాడే వారికి ఈ ధరలు శరాఘాతంగా నిలుస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లోనూ టమోటాల ధరల్లో భారీ పెరుగుదల నమోదవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. కిలోల కొద్ది కొనుగోలు చేసిన వీరు ప్రస్తుతం పావుకేజీ, అరకేజీ కొనాలంటే కూడా వెనుకాముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు.

ఆయా రాష్ట్రాల్లో విపరీత వర్షాలు, వేడి వాతావరణం వల్ల కూడా టమోటా పంటలకు అడ్డంకిగా మారాయి. దీంతో టమోటా పంటల దిగుబడి భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్​ ఏర్పడింది. ఈ ధరలు మరో నెలరోజుల పాటు ఇలాగే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కొత్త పంటలు చేతికి వచ్చేవరకు 15 నుంచి నెలరోజుల సమయం పడుతుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అంతవరకు టమోటా ధరల తగ్గుదలను ఆశించలేమన్నారు.

దేశంలో టమోటా ధరలు..

అండమాన్, నికోబార్ రూ. 100.33, కేరళ రూ. 82, మిజోరం రూ. 77.36, తమిళనాడు, రూ. 73.26, తెలంగాణ రూ. 64.8, గోవా రూ. 64, నాగాలాండ్​ రూ. 63, అరుణాచల్​ ప్రదేశ్​ రూ. 63, మహారాష్ర్ట రూ. 62,  ఆంధ్రప్రదేశ్​ రూ. 55.6, కర్ణాటక రూ. 55.53, సిక్కిం రూ. 55.4, ఒడిశా రూ. 51, మేఘాలయ రూ. 52, త్రిపుర రూ. 51.5, పశ్చిమ బెంగాల్​ లో రూ. 51 రూపాయలు ధర పలుకుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది.