గిరిజన చరిత్రతోనే దేశ చరిత్ర సంపూర్ణం
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా
అగర్తలా: గిరిజన సమాజం చరిత్ర లేకుండా భారతదేశ చరిత్ర అసంపూర్ణమని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. శుక్రవారం అగర్తలాలో బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశ చరిత్రలో అనాదిగా ముందుగా గిరిజనులు, ఆదివాసీల చరిత్ర వేళ్లూనుకుందన్నారు. ప్రకృతిని పూజించే వారి విధానంలో భారతదేశ చరిత్ర దాగి ఉందన్నది గుర్తెరగాలన్నారు. కేవలం పూజించడమే గాకుండా అదే ప్రకృతిని కాపాడడంలో కూడా గిరిజనులకు పెద్దపీట అన్నారు. అవసరం మేరకే వినియోగించుకుంటూ అటవీ సంరక్షణను కాపాడుకుంటూ, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో వారిది కీలక పాత్ర అన్నారు. అంతేగాక సరిహద్దుల రక్షణ, అటవీ సంరక్షణలో కూడా ఎంతోమంది గిరిజనులు పోరాటాలకు ఆద్యులుగా నిలిచారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో వీరి భాగస్వామ్యం గొప్పదని జ్యోతిరాధిత్య సింధియా కీర్తించారు.