మేళా నిర్వహణతో దేశం జాగృతం
The country is awakened by the organization of the Mela

లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మహానీయులతో ప్రేరణ పొంది అనుమానాలను తిప్పికొట్టాం
కలలను సాకారం చేసుకునే దిశగా భారత్ అడుగులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత స్వాతంత్రం కోసం భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ లాంటి ఎందరో మహానీయులు చేపట్టిన అనేక ఉద్యమాలతో ప్రేరణ పొంది ప్రయాగ్ రాజ్ లాంటి మహాకుంభ్ మేళాను విజయవంతం చేయగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహాకుంభమేళాతో వేల సంవత్సరాల భారత సంస్కృతి, సాంప్రదాయాలను మేల్కోపిన మహాత్తర ఘట్టంగా అభివర్ణించారు. దీంతో దేశ హితిహాసం బలోపేతం అవడమే గాకుండా దేశ ప్రజలను మరోమారు జాగృతం చేసే ప్రయత్నంలో విజయవంతం అయ్యామన్నారు. భవిష్యత్ భారత్ సురక్షితమైన, అభివృద్ధి కలలను సాకారం చేసుకునే దిశవైపు కొనసాగుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
విదేశీయులకు సైతం నమ్మకం, విశ్వాసాలు ఏర్పడ్డాయి..
మంగళవారం లోక్ సభలో మహాకుంభమేళా విజయవంతం పట్ల దేశవాసులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంతపెద్ద మేళాను విజయవంతం చేసిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, విద్యుత్, అన్నిశాఖల అధికారులు, యూపీ ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహాకుంభమేళాపై ప్రసంగించడానికి వచ్చానని చెప్పారు. మేళా నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు, విమర్శలకు ధీటైన సమాధానం చెప్పగలిగామన్నారు. రామ మందిర ప్రాణప్రతిష్ట, మహాకుంభమేళా నిర్వహణతో రాబోయే వెయ్యి సంవత్సరాల భవితకు పునాదులు వేశామన్నారు. దేశంలోని ప్రతీ ఒక్కరిని చైతన్యవంతం చేయగలిగామన్నారు. చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగానికి ఒక శతాబ్ధం గడిచిందన్నారు. దివి నుంచి భువికి గంగాదేవిని తీసుకువచ్చిన అద్భుత ప్రయత్నం మన చరిత్రలోనే ఉందన్నారు. ఇలాంటి ఎన్నో గాథలతో ప్రేరణ పొందామని మోదీ చెప్పారు. ప్రపంచం మొత్తం మహాకుంభమేళా విజయవంతం కావడంతో నివ్వెరపోయాయని, దేశ సంస్కృతి, సాంప్రదాయాలపై విదేశీయులకు సైతం నమ్మకం, విశ్వాసాలు ఏర్పడ్డాయని అన్నారు. ఈ ప్రయత్నం అందరి శ్రమకు విజయసంకేతమన్నారు.
మారిషస్ లోనూ గొప్ప ఉత్సాహం..
మారిషస్ పర్యటనలో తాను త్రివేణి పవిత్ర జలాన్ని తీసుకెళ్లానని ప్రధాని వివరించారు. అక్కడి గంగా చెరువులో నిమజ్జనం చేయగా అక్కడి ప్రజల్లోనూ గొప్ప ఉత్సాహం, విశ్వాస వాతావరణం నెలకొనడం చూశానని అన్నారు. నదీ జలాలను కాపాడుకునే, పరిశుభ్రతను కొనసాగిస్తూ రక్షించుకునేలా మనందరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నూతన యువతరం కూడా విశ్వాసాలను, సాంప్రదాయాలను గర్వంగా స్వీకరించడం ప్రారంభించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.