నాగ్ పూర్ అల్లర్లు 47 మంది అరెస్ట్
47 arrested in Nagpur riots

11 ప్రాంతాల్లో కర్ఫ్యూ
హింసపై అర్థరాత్రి సీఎం ఆరా
సంఘటనా ప్రాంతానికి కేబినెట్ మంత్రి
నాగ్ పూర్: ఔరంగజేబు సమాధి వివాదం, హింసకు సంబంధించిన విషయంలో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 47 మందిని అరెస్టు చేసినట్లు మహారాష్ర్ట మంత్రి యోగేష్ కదమ్ తెలిపారు. డీసీపీ సహా 14 మంది పోలీసులు, 23 మంది పౌరులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. సోమవారం రాత్రి నాగ్ పూర్ లోని మహల్ ప్రాంతంలో హింస చెలరేగింది. రాళ్లు రువ్వారు, వాహనాలు తగుబలబడ్డాయి. డీసీపీ నికేతన్ కదమ్ పై గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో దాడి చేశారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. హన్స్ పూరి ప్రాంతంలో మరోమారు మధ్యరాత్రి ఘర్షణ జరిగింది. కోత్వాలి, గణేష్‌పేట్, తహసీల్, లకద్‌గంజ్, పచ్‌పావోలి, శాంతినగర్, సక్కర్దార, నందన్వన్, ఇమామ్‌వారా, యశోధరనగర్, కపిల్‌నగర్ లలో హింస తీవ్రతరం కావడంతో 11 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీస్ కమిషనర్ రవీంద్ర సింఘాల్ తెలిపారు. కాగా అర్థరాత్రి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హింసపై ఆరా తీశారు. వెంటనే కేబినెట్ మంత్రి చంద్రశేఖర్ బవాంకులతే అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రశేఖర్ వెంటనే పరిస్థితిని సమీక్షించేందుకు నాగ్ పూర్ కు బయలుదేరారు.
మరోవైఉ ఔరంగజేబు సమాధి వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో రెండు ప్లాటూన్ల ఎస్ఆర్ పీఎఫ్ బలగాలను మోహరించినట్లు స్థానిక ఎస్పీ వివరించారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో కవాతు నిర్వహించారు.
కాగా ఇరువర్గాలు చేసుకున్న దాడుల్లో కొందరు ముఖాలకు ముసుగులేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి చేతుల్లో కత్తులు, కర్రలు, సీసాలు, గొడ్డళ్లు లాంటి మారణాయుధాలు ఉన్నట్లు ప్రత్యేక సాక్ష్యులు వివరించారు.
కాగా హింసపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. హిందువులను భయపెట్టేందుకు రెచ్చగొట్టి హింస తలెత్తేలా చేశారని బీజేపీ, ఆర్ఎస్ ఆరోపిస్తుండగా, బీజేపీకి చెందిన వారే ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి.