పడవ మునకపై ప్రధాని విచారం
మృతులకు కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ముంబాయి పడవ ప్రమాదంపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. గురువారం ప్రధానమంత్రి ఈ ప్రమాదంపై మీడియా మాధ్యమంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ముంబాయి సమీపంలో నీల్‌కమల్ అనే ప్రయాణీకుల ఫెర్రీని ఇండియన్ నేవీ బోటు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫెర్రీ గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు వెళుతోంది. సముద్ర ప్రమాదంలో 10 మంది పౌరులు, ముగ్గురు నేవీ సిబ్బందితో సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం సహాయనిధి కింద రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల్లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, పోలీసులు రాత్రంతా పాల్గొన్నారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.