త్వరలో ఎన్నికలు

ప్రజాస్వామ్యంలో నిర్భయంగా పాల్గొనాలి ఆగస్ట్​ 20లోగా ఓటర్ల జాబితా విడుదల మీడియాతో సీఈసీ రాజీవ్​ కుమార్​

Aug 9, 2024 - 20:26
 0
త్వరలో ఎన్నికలు

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో వీలైనంత త్వరగా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్​ కుమార్ అన్నారు. శుక్రవారం ఎన్నికల నిర్వహణపై మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్​ లో ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు. ఒకటి, రెండు చిన్న పార్టీలు మినహా ఎన్నికలకు అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు సిద్ధంగా ఉన్నాయని రాజీవ్​ కుమార్​ పేర్కొన్నారు. పలు పార్టీలు ఎన్నికల ప్రచారం సందర్భంగా అసాంఘిక శక్తుల దాడులు జరిగే అవకాశం ఉందని తమకు భద్రతను పెంచాలని తెలిపాయన్నారు. నిర్భయంగా, సజావుగా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికలకు సహకరించాలని తెలిపామన్నారు. 

విధ్వంసకర శక్తులపై ప్రజలే తమ నిర్ణయాన్ని ఇస్తారని రాజీవ్​ కుమార్​ తెలిపారు. ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చాలాకాలం తరువాత అన్ని పార్టీలు ఎన్నికలను నిర్వహించాలని కోరడం స్వాగతించాల్సిన విషయమని తెలిపారు. ఇది చారిత్రక ప్రజాస్వామ్య విజయమన్నారు.

ఆగస్టు 20లోగా ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈ లోపు జాబితాలో పేర్లను సరిచూసుకోవాలని, పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ర్ట, జిల్లాల అధికారులకు, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. 

జమ్మూకశ్మీర్​ లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో 74 స్థానాలు జనరల్​, 9 ఎస్టీ, 7 ఎస్సీ లకు కేటాయించారు. మొత్తం 87.09 లక్షల మంది ఓటర్లుండగా, వీరిలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 మంది మహిళలు, 169 మంది ట్రాన్స్‌జెండర్లు, 82,590 మంది దివ్యాంగులు, 73943 మంది సీనియర్ సిటిజన్లు, 2660 మంది శతాధిక వృద్ధులు, 76,092 మంది సర్వీస్ ఓటర్లు, 3.71 లక్షల మంది మొదటి సారి ఓటు వేసే అవకాశం దక్కనుంది. 

ఈ సమావేశంలో సీఈసీ రాజీవ్​ కుమార్​ తోపాటు కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు తదితరులు పాల్గొన్నారు.