పాక్​లో హిందూ బాలిక కిడ్నాప్​

ఆందోళన చేపట్టిన మైనార్టీ వర్గాలు న్యాయం చేయాలని పీఎం, సీఎంలకు విజ్ఞప్తి మానవహక్కులను ఆశ్రయిస్తామన్న నాయకులు

Apr 2, 2024 - 19:01
 0
పాక్​లో హిందూ బాలిక కిడ్నాప్​

ఇస్లామాబాద్: పాక్​లో హిందూ బాలిక కిడ్నాప్​కు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. సుక్కుర్​ నగరంలో ఓ హిందూ బాలిక కిడ్నాప్​పై మైనార్టీ వర్గాలు మంగళవారం పెద్ద యెత్తున ఆందోళన చేపట్టాయి. కిడ్నాప్​కు గురైన యువతి ప్రియాకుమారిగా గుర్తించారు. యువతి కిడ్నాప్​పై డేరా మురాద్​ జమాలీలో హిందూవులు ఆందోళనకు దిగారు. తక్షణమే యువతిని క్షేమంగా ఇంటికి చేర్చాలని డిమాండ్​ చేశారు. మైనార్టీలకు న్యాయం జరిగేలా చూడాలని పాక్​ ప్రధాని షెహబాజ్​ షరీఫ్, సింధ్​ సీఎం మురాద్​ అలీ షాలను కోరారు. ఈ ఘటనపై హ్యూమన్​ రైట్స్​ను కూడా ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాలకు సమాన హోదా చట్టం తీసుకురావాలని డిమాండ్​ చేశారు. క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీయ ముస్లింలు, సిక్కులు ఇలా అనేక వర్గాలకు చెందిన వారు ఇక్కడ అపహరణకు గురవుతూనే ఉన్నా పాక్​ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. పాక్​లో హిందూవులే టార్గెట్​గా అపహరణలు చోటు చేసుకుంటున్నట్లు మైనార్టీ నాయకులు ఆరోపించారు. కిడ్నాప్​లు, మతమార్పిడులతో బాలికలు, యువతులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే ప్రియా కుమారిని క్షేమంగా ఇంటికి చేర్చకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని మైనార్టీ నాయకులు హెచ్చరించారు.