పాక్ లో ఉగ్రక్రీడ
Terrorism in Pakistan

జనవరిలో 245 మృతి
74 ఉగ్రదాడుల్లో 91 మంది మృతి
నివేదిక వెల్లడించిన ఇన్సిట్యూట్ ఫర్ కాన్ ఫ్లిక్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: విదేశాలపై తాను వదిలిన విషపు నాగులే ప్రస్తుతం కాలనాగులుగా మారి పాక్ లో నరమేధం సృష్టిస్తున్నాయి. ఇతర దేశాల్లో ఉగ్రవాదం పేరుతో మారణహోమం సృష్టించిన పాక్ ఇప్పుడు అదే ఉగ్రవాదానికి బలవుతోంది. జనవరి 2025లో పాక్ వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 245 మరణించారని ఇన్సిట్యూట్ ఫర్ కాన్ ఫ్లిక్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం గత పది, 15 రోజుల్లో 74 ఉగ్రదాడుల్లో 91 మంది మరణించారని, వారిలో 35 మంది భద్రతా సిబ్బంది, 20 మంది పౌరులు, 36 మంది ఉగ్రవాదులు ఉన్నారని తెలిపింది. 117 మంది గాయపడ్డారని, 53 మంది భద్రతా సిబ్బంది, 54 మంది పౌరులు, 10 మంది ఉగ్రవాదులున్నారని తెలిపింది. 2024తో పోల్చుకుంటే 2025 తొలి నెలలోనే దాడుల శాతం భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉగ్రదాడులు ప్రజా జీవితాన్ని ప్రమాదంలో పడవేస్తున్నాయని దేశ వ్యవస్థను కుప్పకూల్చే అవకాశం ఉందని హెచ్చరించాయి.
అదే సమయంలో జనవరి నెలలో ఉగ్ర నిరోధక చర్యలలో భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని, ఇది 2016తో పోలిస్తే అత్యధికం. 2024 డిసెంబర్ లో 190 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. 2025 జనవరిలో 245 మంది భద్రతా దళాల కార్యకలాపాల్లో మరణించారని నివేదిక స్పష్టం చేసింది. పాక్ లోని భద్రతా దళాలు ఖైబర్ ఫక్తుంక్వా, బలూచిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై ప్రత్యేక ఆపరేషన్ కు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులూ తమ సత్తా చాటుకునేందుకు మారుమూల ప్రాంతాలు, భద్రతా బలగాలపై భారీ దాడులకు తెగబడుతున్నారు. మారణహోమాలు, కిడ్నాప్ లు, దాడులు, బాంబుదాడులు, కాల్పులు, చోరీల వంటి ఘటనలు పెరిగాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఉగ్ర నీడలో సురక్షితమే అనుకున్న పాక్ ను ఇప్పుడు ఈ నీడే శాపంగా మారి దహించివేసే స్థాయికి ఎదిగింది.