శిశువుకు జన్మనిచ్చిన పదో తరగతి విద్యార్థిని!
పోలీసు, శాఖపరమైన విచారణ మొదలు

తమకేం తెలియదంటున్న ప్రభుత్వ వసతి గృహ ప్రధానోపాధ్యాయుడు
భువనేశ్వర్: ఒడిశా మల్కన్ గిరి జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. విషయం మీడియాకెక్కడంతో మంగళవారం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని సోమవారం బోర్డు పరీక్షలకు హాజరైందని, తిరిగి హాస్టల్ కు వచ్చి ఆడశిశువుకు జన్మనిచ్చిందని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ బాలికల హాస్టల్ అయినందున ఇక్కడ బాలురు, పురుషుల ప్రవేశాన్ని నిషేధించామన్నారు. విద్యార్థిని ఎలా గర్భవతి అయిందో తెలియదన్నారు. అయితే వారానికి ఒకసారి ఆరోగ్య కార్యకర్తలు తమ హాస్టల్ లోని విద్యార్థినులను చెకప్ చేస్తారని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఆరోగ్య కార్యకర్తలు తమ పని సరిగ్గా చేయడం లేదని ఆయన వారిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థినినీ మల్కన్ గిరి జిల్లా ప్రధానాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. విద్యార్థిని, శిశువు ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఇంటికి వెళ్లినప్పుడు గర్భవతి అయి ఉండొచ్చని జిల్లా సంక్షేమాధికారి అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసుల విచారణతోపాటు శాఖపరమైన విచారణకు కూడా ఆదేశించామన్నారు. కాగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.