విలువైన సంపద పీఎంసీ

శతాబ్ధి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్మూ

Feb 25, 2025 - 17:39
 0
విలువైన సంపద పీఎంసీ

పాట్నా: పాట్నా మెడికల్​ కాలేజీ అత్యంత విలువైన వారసత్వ సంపదలలో ఒకటని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. మంగళవారం పాట్నా మెడికల్​ కాలేజీ శతాబ్ధి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వైద్య కళాశాల ఒకప్పుడు ఆసియాలోనే అగ్రశ్రేణి ఆసుపత్రులలో ఒకటిగా ఉండేదన్నారు. ఈ కాలేజీలో విద్యనభ్యసించిన వారు దేశం, ప్రపంచంలో విశేష వైద్య సేవలనందిస్తున్నారని ప్రశంసించారు. ప్రజలు అత్యుత్తమ వైద్య చికిత్సల కోసం ఎంతో దూరాభారాన్ని భరిస్తున్నారని అన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో వైద్య సంస్థలపై భారాన్ని తగ్గించడానికి వికేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ అవసరాన్ని అధ్యక్షురాలు నొక్కి చెప్పారు. చెన్నై, హైదరాబాద్​, ముంబాయి, ఇండోర్​ లలో ఉన్నట్లే ప్రత్యేక వైద్యసంరక్షణ కేంద్రాలను బిహార్​ లోనూ అభివృద్ధి చేయాలని కోరారు. ఇటువంటి ప్రయత్నాలకు పాట్నా మెడికల్​ కాలేజీ పూర్వ విద్యార్థులు దోహదపడతారని ఆశించారు. వీరి ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సాధ్యపడుతుందన్నారు. దీంతో రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ముర్మూ ఆకాంక్షించారు. ఖచ్చితమైన వైద్యానికి ఎఐ, రోబోటిక్స్​ వంటి నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం వల్ల క్లిష్టమైన వైద్యం మరింత సులభతరం అవుతుందన్నారు. అవయవదానం, రక్తదానంపై వైద్యులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, సమాజానికి వారి సేవను నొక్కి చెప్పాలని వైద్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ విజ్ఞప్తి చేశారు.