క్రిప్టో కరెన్సీ కుంభకోణం 60 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు
Crypto currency scam CBI searches 60 places simultaneously

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గెయిన్ బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో దేశవ్యాప్తంగా 60 చోట్ల ఏకకాలంలో సీబీఐ మంగళవారం దాడులు చేసింది. ఢిల్లీ ఎన్ సీఆర్, పూణే, చండీగఢ్, నాందేడ్, కొల్హాపూర్, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని పలు చోట్ల ఏకకాలంలో దాడులు చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అమిత్ భరద్వాజ్ మృతి చెందాడు. ప్రస్తుతం ఇతని కుమారుడు అజయ్ భరద్వాజ్ ను సీబీఐ తమ విచారణ పరిధిలోకి తీసుకొని విచారిస్తుంది. 2015లో అమిత్ భరద్వాజ్ గెయిన్ బిట్ కాయిన్ విక్రయాలను ఒక సంస్థను ఏర్పాటు చేసి విక్రయించాడు. కొన్నేళ్లపాటు ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన వారికి వారి పెట్టుబడికి వడ్డీలను బాగానే చెల్లించాడు. 2017లో పెట్టుబడిదారులు తగ్గిపోవడంతో అప్పటికే ఉన్న గెయిన్ బిట్ కాయిన్ కొనుగోలు చేసిన వారికి డబ్బులు ఇవ్వలేక చేతులెత్తేశాడు. గెయిన్ బిట్ కాయిన్ కు బదులుగా స్వంత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట మోసానికి తెరలేపాడు. దీన్ని గుర్తించిన పెట్టుబడిదారులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబీఐ విచారణ బాధ్యతను చేపట్టింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మోసం, మనీలాండరింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐకి అప్పగించారు.