ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

ఎన్ని ఇబ్బందులున్నా ఠంఛన్ గా పీఎం కిసాన్ నిధులు
నా తెలంగాణ, హైదరాబాద్: దేశంలో రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారమే పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారన్నారు. సంవత్సరానికి మూడుసార్లు ఒక్కరోజు ఆలస్యం గాకుండా ప్రతీ రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. వందకు వందశాతం రైతుల పంట ఉత్పత్తులు పెంపుదలకు, ఎరువులు, విత్తనాలు, సాకు ఖర్చుకు బ్యాంకుల చుట్టూ వెళ్లకుండా ఈ నిధులు ఉపయోగపడుతున్నాయన్నారు. మంగళవారం బీజేపీ నగర కార్యాలయం మీడియా సమావేశంలో జి.కిషన్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో 31 లక్షల మంది రైతులకు లబ్ధి..
అనేక అడ్డంకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నా కేంద్రప్రభుత్వం రెగ్యులర్ గా పీఎం కిసాన్ నిధులు అందజేస్తుందన్నారు. 19వ విడత డబ్బులు 9.08 కోట్ల మంది అకౌంట్లలో రూ. 22 కోట్లు జమ చేశామన్నారు. తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ కింద పీఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు అందజేస్తున్నామన్నారు.
కొరత వార్తలు చూడగానే కేంద్రంతో మాట్లాడా..
వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంఎస్ పీని కూడా పెంచామన్నారు. తెలంగాణ రాష్ర్టంలో కూడా ఎరువుల కొరత ఉందని పత్రికల్లో చూశామన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు క్యూలైన్లలో చెప్పులు పెట్టుకొని ఎదురు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. దీనిపై వెంటనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడానన్నారు. అనేక ప్రాంతాల్లో రైతులుఎరువుల కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వెంటనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. కేంద్రం స్పష్టంగా రాష్ర్ట ప్రభుత్వం అడిగిన దాని కంటేఎక్కువ కోటా విడుదల చేశామన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వ అసమర్థత కారణంగానే కొంతమంది వ్యాపారస్థులు కృత్రిమ కొరత సృష్టించే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎరువుల కొరతనే లేదని అధికారులు చెబుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా యూపీఏ హయాంలో యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించేవారన్నారు. కానీ మోదీ ప్రభుత్వంలో ఇలాంటి వ్యవస్థలపై ఉక్కుపాదం మోపామన్నారు.
9.5 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అయితే.. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపాం..
దేశీయంగా 90 శాతం యూరియాను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రామగుండంలో కూడా ఉత్పత్తిని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లుగా దేశంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. పాత అలవాటు ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 రబీ సీజన్ 9.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉంటాయని, రాష్ర్టం, కేంద్రం జాయింట్ సమావేశంలో నిర్ణయించాయన్నారు. కేంద్రం పది లక్షల ఎరువులు పంపించిందన్నారు. అదనంగానే ఇచ్చామన్నారు. 1 అక్టోబర్ నుంచి 22 ఫిబ్రవరి వరకూ కూడా తెలంగాణలో యూరియా అందుబాటులో ఉందన్నారు. గతేడాదితో పోలిస్తే 27.37 శాతం అత్యధికంగా కేంద్రం సరఫరా చేసిందన్నారు. అదనంగా 22 ఫిబ్రవరి 40వేల టన్నుల యూరియాను కేంద్రం అదనంగా పంపిందన్నారు. 23, 24 తేదీల్లో అదనంగా మరో 48వేల టన్నుల యూరియా ముందుజాగ్రత్త చర్యగా కేంద్రం రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పంపిస్తున్నట్లు వెల్లడించిందన్నారు. మూడు రోజుల్లో 16వేల టన్నుల యూరియాను పంపిందన్నారు.
లెక్కల్లో 1.22 లక్షల టన్నుల యూరియా..
ప్రస్తుతం రాష్ర్టంలో ఇంకా 1.22 లక్షల టన్నుల యూరియా లెక్కల్లో ఉందన్నారు. ఇదిగాక 6వేల టన్నులు కృష్ణపట్నం పోర్టు ఆదిలాబాద్ కు, కాకినాడ నుంచి తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేశామన్నారు. దక్షిణాది రాష్ర్టాలతో పోలిస్తే అత్యధికంగా తెలంగాణకు ఎరువుల సరఫరా చేస్తుందన్నారు. యూరియాను రాష్ర్ట ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉంచామన్నారు. వీటిని సరఫరా చేయాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఎరువులను సమర్థవంతంగా రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణి చేయాలన్నారు. రైతుల ఇబ్బందులను తొలగించాలని, ఇది ముఖ్యమైన అంశమన్నారు. రైతులు క్యూలో ఉండడం దురదృష్టకరమన్నారు.
మేధావులు, విద్యావంతుల గొంతుక బీజేపీదే..
పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొద్దిసేపట్లో ముగియనుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ ఓటర్లను వ్యతిగతంగా కలిసేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చానన్నారు. ఆ విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయిలోని ఓటర్లను కలిసే కార్యక్రమాలను చేపట్టామన్నారు. చట్టసభల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రల సమస్యలు వినిపించే వారికే ఓటు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో వారి గుండెచప్పుడుగా మారి వారి గొంతుకను బీజేపీ వినిపిస్తుందన్నారు. మూడు సీట్లలో ఒక్కసీటులోనే కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు.
ఎవరినో ఎన్నుకుంటే లాభం లేదు.. ఆశీర్వదించండి అండగా నిలుస్తాం..
మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటే లాభం లేదన్నారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలు, ప్రభుత్వాలను నిలదీసే సత్తా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. మూడు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఈ వర్గాలకు అండగా నిలబడాలని వారిసమస్యల పరిష్కారాల కోసం చొరవ చూపాలని,పోరాటం చేయాలని బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఈ మూడు స్థానాల్లో బీజేపీని ఆశీర్వదించి అండగా నిలవాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సీఎం మాటలు నీటిమూటలే..
ఒక్కసీటులోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీఎం 14 నెలలుగా మాట్లాడిన మాటలే ఈ ప్రచారంలోనూ మాట్లాడారని అన్నారు. ఆయన మాటలకు విద్యావంతులు పట్టించుకోరని అన్నారు. తెలంగాణకు సీఎం అయిన రేవంత్ రెడ్డి ఆయన అసమర్థతను తమపై రుద్దుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదన్నారు. తాను అడ్డుకుంటున్నానన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. మెట్రోకు నిధులు, ప్రణాళికలు ఎవరన్నారు. రాష్ర్ట ప్రభుత్వం మెట్రో నిర్మాణం చేయదలిస్తే కేంద్రం, తాను ఎందుకు అడ్డుకుంటామని నిలదీశారు. రాష్ర్ట ప్రభుత్వం ఏదైరనా ప్రాజెక్టు నిర్మాణం చేస్తే తమకు అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి బీజేపీని, తనను విమర్శిస్తూ కాంగ్రెస్ అధిష్టానం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఈ ఆరోపణలు, విమర్శలు అందులో భాగమేనన్నారు.
ఫోన్ ట్యాపింగ్ మీరు విచారిస్తారా?.. సీబీఐకి అప్పజెపుతారా?..
కేంద్రం ఆధ్వర్యంలో రీజినల్ రింగ్ రోడ్డును తీసుకువచ్చామన్నారు. నీటి వివాదాలపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని పోరాడాలని, సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐకి ఇవ్వాలని బీజేపీ కోరిందన్నారు. తాము ఎందుకు అడ్డుకుంటున్నామని నిలదీశారు. నిందితులు ఎవరి హయాంలో విదేశాలకు వెళ్లారని నిలదీశారు. ఇతరదేశాల నుంచి నిందితులను తీసుకురావాలంటే ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయన్నారు. 1996 నుంచి పోరాటం చేస్తుంటే అనేక సంవత్సరాల తరువాత బాంబు పేలుళ్ల నిందితులను అమెరికా కోర్టు ఇప్పటికి అనుమతించిందన్నారు. ఒక సీఎం స్థాయి పరిపాలనపై అవగాహన లేకుండా ఈ రకమైన మాటలతో నవ్వుల పాలు కావొద్దన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగిస్తే తేల్చే బాధ్యత తమదన్నారు. కాళేశ్వరం, ఔటర్ రింగ్ రోడ్డు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, భూముల కొనుగోలు, మేడిగడ్డల మీద అధికారంలో రాకముందు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, వచ్చాక మాట మార్చి తప్పుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి విధానాలను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. చేతనైతే దర్యాప్తు చేసి శిక్షించాలని, లేదంటే సీబీఐకి అప్పజెప్పాలని అన్నారు.