వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగించాలి
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ
భువనేశ్వర్: వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ వ్యవసాయ శాస్త్రవేత్తలుకు పిలుపునిచ్చారు. గురువారం భువనేశ్వర్ లోని ఒడిశా యూనివర్సిటి ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ 40వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరంలోని మార్పులు, సహజ వనరుల నుంచి రైతులను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు శాస్త్రవేత్తలు నూతన ప్రణాళికలను రూపొందించాలన్నారు. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, నానో టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ఉపయోగించి సాధికారత దిశగా ముందుకు వెళ్లాలన్నారు. భూసారం పరిరక్షణ, సహజ వనరుల సక్రమ వినియోగంపై దృష్టి సారించాలన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో భారత్ వ్యవసాయ రంగంలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని, ఇతర దేశాలకు ఆహారధాన్యాలు, వ్యవసాయ పరికరాలను ఎగుమతులు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. భారత్ వ్యవసాయ రంగంలో పాటిస్తున్న అత్యాధునిక సాంకేతికత వల్ల వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. 2047 వరకు భారత్ వ్యవసాయం, వ్యవసాయదారుల అభివృద్ధి లక్ష్యాన్ని కూడా చేరుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విశ్వాసం వ్యక్తం చేశారు.