మోదీనే ఎన్నుకోవాలి తనను ఆశీర్వదించాలి
దేశభద్రత, అభివృద్ధికి ప్రాధాన్యం డిజిటల్ విప్లవంతో ప్రపంచదేశాలు వెనక్కు శంషాబాద్ ఏయిర్పోర్ట్లా సికింద్రాబాద్రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం రూ. 350 కోట్లతో యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ మంజూరు రాష్ర్ట ప్రభుత్వం భూమి ఇస్తే వెంటనే పనులు ప్రారంభం రూ. 26వేల కోట్లతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో రీజినల్ రింగు రోడ్డు సికింద్రాబాద్ ప్రచారంలో బీజేపీ కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి
నా తెలంగాణ, హైదరాబాద్: దేశ భద్రత, అభివృద్ధి, కీర్తి, ప్రతిష్ఠలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతున్న ప్రధాని నరేంద్రమోదీనే మరోమారు ఎన్నుకోవాలని, బీజేపీ పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నేతృత్వంలో దేశం డిజిటల్ విప్లవంలో ప్రపంచ దేశాలను కూడా వెనక్కు నెడుతోందన్నారు. ప్రస్తుతం ఇంటింటా ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు అతి చవక ధరలకే లభిస్తున్నాయన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్లినా మోదీకి, బీజేపీ పార్టీకి జై కొడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్పునర్నిర్మాణం, ఆధునీకరణ కోసం రూ. 720 కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. ఈ రైల్వే స్టేషన్ శంషాబాద్ ఏయిర్పోర్ట్లా నిర్మాణం జరగబోతోందని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ రూ. 350 కోట్లతో భూమి పూజ, కాచిగూడ రూ. 433 కోట్లతో పునర్నిర్మాణం, ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. దేశంలో 40 వందేభారత్ రైళ్లను మంజూరు చేస్తే అందులో నాలుగింటిని తెలంగాణకు కేటాయించేలా కృషి చేశానని వివరించారు.
యాదగిరి గుట్టకు రూ. 350 కోట్లతో ఎంఎంటీఎస్‌ను మంజూరు చేయించామని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం వెంటనే కావాల్సిన భూమి ఇస్తే నిర్మాణ పనులను చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్చుట్టూ రూ. 26వేల కోట్లతో రీజినల్ రింగురోడ్డును ఏర్పాటు చేయనున్నామని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారికి ఇటువంటి రీజినల్ రింగురోడ్డును నిర్మించుకునే బృహత్తర అవకాశాన్ని ప్రధాని మోదీ తెలంగాణకు కల్పించారని అన్నారు. రిజీనల్ రింగు రోడ్డు ఏర్పాటుతో అనేక పరిశ్రమలు, కార్పొరేట్ ఆపీసులు ఏర్పాటవుతాయని మంత్రి స్పష్టం చేశారు. దీనివల్ల వేలాదిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. మధ్య తరగతి వారికి అందుబాటు ధరలో ఇళ్లు లభిస్తాయని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉన్నారు కాబట్టే దేశంలోనే తొలిసారిగా ఈ అవకాశాన్ని మనకు కల్పించారని వివరించారు. అనేక ప్రాంతాల్లో ప్రజల ఆయురారోగ్యాల దృష్ట్యా ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత లేకుండా నిధులు మంజూరు చేస్తున్నామని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 13వ తేదీన తెలంగాణ ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రధాని మోదీని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కిషన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.