పద్మారావుపై తలసాని కుట్ర!
సికింద్రాబాద్ లో తన కుమారుడికి లైన్ క్లియర్ చేసే వ్యూహం – ఎంపీగా పద్మారావును ఓడించి.. ఆయనను బద్నాం చేసే యోచన – పద్మారావు తమకు ఎమ్మెల్యేగానే ఉండాలంటున్న గులాబీ కేడర్ – కేసీఆర్ ఒత్తిడి మేరకు బలవంతంగానే బరిలోకి దిగుతున్న పద్మారావు – తలసాని మైండ్ గేమ్ పై సికింద్రాబాద్ బీఆర్ఎస్ లో పెద్ద చర్చ
నా తెలంగాణ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకప్పుడు తన నియోజకవర్గమైన సికింద్రాబాద్ లో పద్మారావు ప్రాధాన్యం తగ్గించి తన కుమారుడు సాయి కిరణ్ పొలిటికల్ కెరీర్ కు లైన్ క్లియర్ చేయాలని తలసాని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సికింద్రాబాద్ లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలిపి.. ఓడించడం ద్వారా ఆయన ప్రతిష్ట దెబ్బతీయాలనే అంతర్గత వ్యూహరచన చేసినట్లు సికింద్రాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నది. తలసాని కావాలనే కేసీఆర్ ద్వారా పద్మారావు ఖాతాలో ఘోర పరాజయాన్ని నమోదు చేయించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తున్నది.
అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేసి..
పద్మారావు గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచే బీఆర్ఎస్ లో ప్రజానేతగా గుర్తింపు పొందారు. సికింద్రాబాద్ ప్రజల విశ్వాసం పొందిన ఆయన 2014లో గెలుపొంది కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. 2018లో గెలిచి డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరి పద్మారావు మంత్రి పదవికి చెక్ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బయటకు నవ్వుతూ కనిపించినా.. ఎప్పటి నుంచో పద్మారావు అంటే తలసానికి పడదు. ఎందుకంటే 2004లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు టీడీపీ నుంచి పోటీ చేసిన తలసానిని ఓడించారు. సికింద్రాబాద్ ఒకప్పుడు తలసాని ఏలుబడిలో ఉండేది. ఆయన 1994, 1999తోపాటు, 2008లో జరిగిన ఉప ఎన్నికలోనూ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో సనత్ నగర్ కు మారి,2014, 2018, 2023 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకొని బరిలోకి దింపిన తలసాని, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేని సమయంలో.. కావాలనే ఓడిపోయే అవకాశం ఉన్న సికింద్రాబాద్ ఎంపీ సీటును పద్మారావుకు వెళ్లేలా కేసీఆర్ వద్ద చక్రం తిప్పినట్లు తెలుస్తున్నది. సికింద్రాబాద్ లో బీజేపీ నుంచి మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్నందున.. పద్మారావు ఓడిపోతే.. ఆయన ప్రతిష్ట దెబ్బతీసి.. నెమ్మదిగా సికింద్రాబాద్ లో తన కుమారుడిని ఎమ్మెల్యేగా సిద్ధం చేయాలనేది తలసాని ప్లాన్. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నా.. పద్మారావు అసమర్థత వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని ఆయనను వ్యక్తిగతంగా బద్నాం చేసే వ్యూహరచన జరిగినట్లు గులాబీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
వద్దంటున్న గులాబీ కేడర్
పద్మారావు సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దిగడాన్ని గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. తమ నాయకుడు సికింద్రాబాద్ ఎంపీగానే ఉండాలని, తమతోపాటు ఉండాలని వారు కోరుకుంటున్నారు. నిజానికి ఎంపీగా పోటీ చేయడం పద్మారావుకు కూడా ఇష్టం లేదు. కానీ కేసీఆర్ ఒత్తిడి వల్ల ఆయన పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు. మరి తలసాని వ్యూహరచనలో పద్మారావు బద్నాం అవుతారా? ప్లాన్ రివర్స్ అవుతుందా చూడాలి మరి