నిరుపేదలకు మేలు చేస్తే టీఎంసీ జీర్ణించుకోలేదు

రామ నవమి ర్యాలీపై విషం చిమ్ముతున్న మమత గిరిజనులు, దళితులు,పేదలు మీకు కట్టుబానిసలా? వారిని మోకాళ్లపై నిలుచోబెడతారా? అవినీతి, అక్రమాలపై దర్యాప్తునకు వస్తే దాడులు చేస్తారా? బాలూర్‌ఘాట్‌ ఎన్నికల సభలో టీఎంసీని తూర్పారబట్టిన మోదీ

Apr 16, 2024 - 17:40
 0
నిరుపేదలకు మేలు చేస్తే టీఎంసీ జీర్ణించుకోలేదు

కోల్​ కతా: మోదీ హామీలతో, కేంద్ర సంక్షేమ పథకాలతో పశ్చిమ బెంగాల్​ ప్రజలు బాగుపడడాన్ని టీఎంసీ జీర్ణించుకోలేక పోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామనవమి ర్యాలీపై కూడా సీఎం మమతా బెనర్జీ విషం గక్కుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్​ లోని బాలూర్‌ఘాట్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మమత ప్రభుత్వం చొరబాటుదారులకు భద్రత కల్పిస్తోందని ఆరోపించారు. మమత ప్రభుత్వం చొరబాటుదారులకు భద్రత కల్పిస్తోందని, అయితే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, నేరాలు జరుగుతున్నా ఆమెకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. కేంద్ర ఏజెన్సీలు  అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు వస్తే వారిపై దాడికి పాల్పడతారని దుయ్యబట్టారు. టీఎంసీ రాష్ట్రాన్ని చొరబాటుదారులకు, గూండాలకు లీజుకు ఇచ్చినట్లుందన్నారు.
మోదీ హామీలతో ప్రజలు లబ్ధి పొందడాన్ని జీర్ణించుకోలేక మమత తప్పుడు ప్రకటనలు, వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఎంసీకి దళితులు, గిరిజనులు, నిరుపేదలు బానిసలు కాదన్న విషయం గుర్తెరగాలన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు.  ఇక్కడి గిరిజన సామాజిక వర్గం  త్యాగాలకు దేశం రుణపడి ఉంటుందన్నారు. వారిపై కనీస గౌరవం లేకుండా మహిళలను చూడకుండా మమత ప్రభుత్వం మోకాళ్లపై నిలబెడుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వారిని ఎదగనీయకుండా అణగదొక్కే విధంగా మమత ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాలూర్​ ఘాట్​ లో తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి ఈసారి తమ గెలుపు ఖాయమని ప్రధానినరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న 400 దాటుతుందని, మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందని నేడు రాష్ట్రం మొత్తం చెబుతోందని తెలిపారు. అప్పుడు పశ్చిమ బెంగాల్​ లోని ప్రతీ నిరుపేద ఇంటికి తమ పథకాలను తీసుకెళ్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. త్వరలో టీఎంసీ దుకాణాన్ని ప్రజలు మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రధాని మోదీ తెలిపారు. 
రామనవమి ఉత్సవాలను ఆపేందుకు మమత ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించిందని తమకు తెలిసిందన్నారు. వేడుకలు ఆపేందుకు కుట్రలు చేసిందన్నారు.శోభాయాత్రకు కూడా కోర్టు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇది హిందువుల మనోభావాలతో కూడుకున్న విషయమని తెలిపారు. పశ్చిమ బెంగాల్​ వేదికగా దేశ వ్యాప్తంగా ఉన్న హిందు సమాజానికి శ్రీరామనవమి శుభాకాంక్షలను ప్రధాని మోదీ తెలిపారు.