సీఎం కేజ్రీవాల్​ కు సుప్రీంలో చుక్కెదురు బెయిల్​ పిటిషన్​ పై నిర్ణయం వాయిదా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కు సుప్రీంలోనూ చుక్కెదురైంది. ఆయన పిటిషన్​ ను మంగళవారం విచారించిన సుప్రీం నిర్ణయాన్ని వాయిదా వేసింది.

May 7, 2024 - 17:25
 0
సీఎం కేజ్రీవాల్​ కు సుప్రీంలో చుక్కెదురు బెయిల్​ పిటిషన్​ పై నిర్ణయం వాయిదా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కు సుప్రీంలోనూ చుక్కెదురైంది. ఆయన పిటిషన్​ ను మంగళవారం విచారించిన సుప్రీం నిర్ణయాన్ని వాయిదా వేసింది. పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కేజ్రీవాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది అసాధారణ పరిస్థితి అని.. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించింది. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని… లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి కాబట్టి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని.. కేసుల్లో రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండకూడదని సుప్రీంకు విన్నవించింది. ఇప్పుడు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. ఈ కేసులో కేజ్రీవాల్‌ దర్యాప్తునకు సహకరించలేదన్నది గుర్తెరగాలని తెలిపింది. తొమ్మిది సమన్లను పట్టించుకోలేదని.. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి తెలిపింది.

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో తీహార్ జైల్లో పెట్టారు. తాజాగా మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.