సునో.. రేవంత్​ రెడ్డి పది సీట్లు మావే

తెలంగాణలో డబుల్​ డిజిట్​ సాధిస్తం: అమిత్​ షా

May 9, 2024 - 16:33
 0
సునో.. రేవంత్​ రెడ్డి పది సీట్లు మావే
  • ఎన్డీయేకు 400 స్థానాలు పక్కా
  • ఇప్పటికే 200 మార్క్​ దాటాం
  • తెలంగాణలో ఏబీసీ(ఏ – అసద్​, బీ–బీఆర్​ఎస్​, సీ – కాంగ్రెస్​ ) రాజకీయాలు
  • దోచుకోవడమే కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ విధానం
  • ముస్లింలకు రిజర్వేషన్లతో మిగతా వర్గాలకు ఇబ్బంది
  • మతపర రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెంచుతాం
  • దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తున్నాం
  • భువనగిరి బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి కామెంట్స్​

నా తెలంగాణ, భువనగిరి:

దేశంలో 400 సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అన్నారు. 2024 ఎన్నికలు రాహుల్ గాంధీకి, ప్రధాని మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. గురువారం భువనగిరిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్​ కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్​ షా ప్రసంగించారు. ఇవి కుటుంబ అభివృద్ధి, దేశ అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఇప్పటికే 200 సీట్లకు చేరువయ్యామని, ఈసారి 400 సీట్లు పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణలో బీజేపీ 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచింది. కానీ ఈసారి 10 సీట్లు గెలవబోతున్నాం. కాంగ్రెస్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో షెడ్యూల్ కులాలు, తెగల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీకి రాష్ట్రంలో పది సీట్లు ఇస్తే ముస్లింల రిజర్వేషన్ తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. రాష్ట్రంలో రాహుల్ బాబా ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. కాంగ్రెస్ వాగ్దానాలు ఎప్పటికీ అమలు చేయదు.. కానీ ప్రధాని మోదీ చెప్పింది తప్పక చేస్తారు’’అని అమిత్​ షా పేర్కొన్నారు.

రేవంత్​ సునో..!

‘‘రేవంత్​ రెడ్డి.. విను. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిస్తే.. ఇప్పుడు10 కంటే ఎక్కువ సీట్లలో గెలువబోతున్నాం. తెలంగాణలో డబుల్​ డిజిట్​ స్కోర్​ మోదీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ ఎన్నికలు ఓట్​ ఫర్​ జిహాద్​ ​కు, ఓట్​ ఫర్​ వికాస్​ ​కు మధ్య, కొంతమంది కుటుంబ సభ్యుల అభివృద్దికి, యావత్​ దేశాభివృద్ధికి మధ్య జరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ఒక్క హామీ కూడా కాంగ్రెస్​ అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు. ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం ఇంకా ఎప్పుడు ఇస్తారు”అని అమిత్​ షా ప్రశ్నించారు. 

రిజర్వేషన్ల రద్దు ప్రశ్నే ఉత్పన్నం కాదు..

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసిందని అమిత్​ షా ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీకి అధికారం ఇస్తే.. ఢిల్లీ నేతలు రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలు  చేస్తున్నారని, గత పదేండ్లుగా ఫుల్​ మెజార్టీతో మోదీ ప్రధానిగా ఉన్నా రిజర్వేషన్లు తొలిగించలేదని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్​ పార్టీ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేస్తున్నదని, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల కోసం మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏబీసీ (ఏ అంటే అసద్​, బీ అంటే బీఆర్​ఎస్​, సీ అంటే కాంగ్రెస్​ ) ఒక్కటేనని, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు మజ్లిస్​ ఆగడాలు, అరాచకాలను ఆపగలుగుతాయా అని ప్రశ్నించారు. ఇవి మూడు ట్రయాంగిల్​ వంటివని, శ్రీరామ నవమి ఊరిగింపునకు కూడా ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్​ ​షా ఆరోపించారు. ఫేక్‌ వీడియోను, ముఖ్యమంత్రి సైతం సర్క్యులేట్‌ చేశారంటూ తప్పుబట్టారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అమిత్​ ​షా ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని పునరుద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా నక్సలిజంను అంతం చేస్తున్నామని, చత్తీస్‌గఢ్‌లో కొద్ది ప్రాంతం మినహా అంతటా తుదముట్టించామని అమిత్‌షా పేర్కొన్నారు. మన్మోహన్‌ సమయంలో, ముస్లింల ఓట్ల కోసం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.