త్రివిధ దళాల బలోపేతం
భవిష్యత్ లో బలమైన సైనిక శక్తిగా భారత్. యూపీ, తమిళనాడులోనూ డిఫెన్స్ కారిడార్లు. స్వావలంబన దిశగా రక్షణ రంగం. పోఖ్రాన్ సైనిక పరేడ్లో ప్రధాని మోదీ
పోఖ్రాన్: రానున్న రోజుల్లో భారత్ బలమైన సైనిక శక్తిగా అవతరిస్తుందని, సైనిక బలం నూతన పుంతలు తొక్కుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భూమి, ఆకాశం, సముద్రాలలో భారత సైనిక శక్తి త్రివిధ దళాలు అత్యద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని, రక్షణ రంగంలో మరింత బలోపేతం అయ్యాయని ప్రధాని కొనియాడారు. పోఖ్రాన్లో త్రివిధ దళాలు మంగళవారం నిర్వహించిన పరేడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. భవిష్యత్ లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోందన్నారు. ఇందులో భాగంగానే యూపీ, తమిళనాడులోనూ డిఫెన్స్ కారిడార్లను నిర్మిస్తున్నామని ఇందుకు రూ. 7వేల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టామన్నారు. ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ సంస్థను భారత్ లో ప్రారంభించామని మోదీ తెలిపారు. గత పదేళ్లలో రక్షణ రంగాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళుతున్నామన్నారు. గత ప్రభుత్వాలు రక్షణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశలో పనిచేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రక్షణ రంగంలో నూతనావిష్కరణలు, ఆయుధాల రూపకల్పనకు ప్రైవేటు రంగాల ద్వారా పెట్టుబడులను ఆహ్వానించి అత్యంత తక్కువ సమయంలో బలోపేతానికి తలుపులు తెరిచామని మోదీ తెలిపారు. ఆధునాతన సాంకేతికతతో కూడుకున్న తుపాకులు, ట్యాంకులు, విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థలు రూపొందిస్తున్నామన్నారు. సైబర్, అంతరిక్ష రంగాల్లోనూ ‘మేక్ ఇన్ ఇండియా’లకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
రక్షణ రంగంలో భారత్ పెద్ద అడుగు వేసిందన్నారు. రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడడం క్రమేపీ మానుకునేలా, దేశీయంగానే ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం కల్పిస్తున్నామన్నారు. పోఖ్రాన్ సాక్షిగా రక్షణ రంగంలోని సైనిక శక్తిని దేశం చూసి గర్విస్తోందని మోదీ అన్నారు.