సజావుగా గ్రూప్ వన్ పరీక్షలకు చర్యలు
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నా తెలంగాణ, నిర్మల్: ఆదివారం రాష్ర్టవ్యాప్తంగా జరగనున్న గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు పూర్తయ్యాయని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ నిబంధనలపై సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, జిల్లాలో గ్రూప్-వన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలన్నారు. విధుల్లో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. రూట్ అధికారులు తమ కేంద్రాలను ముందుగానే చూసుకోవాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరీక్ష కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం 7 గంటలకే అధికారులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటలవరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులతో సహా, సిబ్బందికి కూడా మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు తెచ్చుకునే హాల్ టికెట్, ఫోటో, ఇతర గుర్తింపు కార్డులతో సరిపోల్చుకోవాలని సూచించారు. బూట్లు, బెల్ట్ లు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు మూసి వేయాలన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకున్నా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఫైజాన్ అహ్మద్, గ్రూప్ వన్ పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త గంగారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.