నా తెలంగాణ, సంగారెడ్డి: అక్రమ గంజాయి రవాణా పై ఉక్కుపాదం మోపుతామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చిన్నోడి రూపేష్ స్పష్టం చేశారు. చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్ ఐ రాజేందర్ రెడ్డి, తన సిబ్బంది, సీసీఎస్ సిబ్బందితో కలిసి ఎన్హెచ్–65 వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మహీంద్రా బోలెరో వాహనంలో 140 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనం నుంచి లఖన్, సిద్ధిరామ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మల్లుగొండ అనే కర్ణాటకకు చెందిన వ్యక్తి ఒడిశా లోని రాహుల్ నుంచి ఎండు గంజాయి సేకరించి వీరి ద్వారా పంపుతున్నట్లుగా గుర్తించామన్నారు. గంజాయి సరఫరాలో సునీల్, కిరణ్, మల్లేశ్ నాయక్ అనే మరో ముగ్గురు కూడా ఉన్నారని వీరంతా ముఠాగా ఏర్పడి మహారాష్ర్టలోని వివిధ ప్రాంతాలలో అమ్ముతున్నారని గుర్తించామన్నారు. ముగ్గురు అనుమానితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఈ సమావేశంలో జహీరాబాద్ డీఎస్పీ కె. రామ్మోహన్ రెడ్డి, టౌన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ యస్. శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ లు విజయ్ కృష్ణ, రమేష్, మల్లేష్, చిరగ్ పల్లి ఎస్ఐ కె. రాజేందర్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్, మాణిక్ రెడ్డి, ఏఎస్‌ఐ, సిసిఎస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.