తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల ఎక్స్​ గ్రేషియా

Stampede victims Rs. 25 lakh ex gratia

Jan 9, 2025 - 13:39
Jan 9, 2025 - 14:08
 0
తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల ఎక్స్​ గ్రేషియా

బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
ఉన్నతస్థాయి సమావేశంలో బాధ్యులపై చర్యలు
మృతులకు పోస్టుమార్టం పూర్తి, అంబులెన్సుల్లో స్వగ్రామాలకు తరలింపు
బాధితులకు రుయా, స్విమ్స్​ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సంతాపం
ప్రభుత్వంపై వైఎస్​ ఆర్సీపీ విమర్శలు

తిరుపతి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోగా, 34మందికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ఎక్స్​ గ్రేషియా ప్రకటించింది. గురువారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్​ ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలతో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు తిరుపతికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదదర్చారు. గాయపడ్డవారిని పరామర్శించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. తొక్కిసలాట ఘటనపై గురువారం ఉదయం సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించనున్నారు. సీఎం తోపాటు డిప్యూటీ సీఎం పవన్​ కళ్యాణ్​, మంత్రి నారా లోకేష్​, మాజీ సీఎం వైఎస్​ జగన్​ లు కూడా బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. 

తొక్కిసలాట ఘటనపై మంత్రులు మాట్లాడుతూ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సీసీ కెమెరాల ద్వారా అధికారులు తప్పేవరిదనే విషయాన్ని ఆరా తీస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలోని రామానాయుడు పాఠశాలలో టోకెన్ల జారీ చేశారు. టోకెన్లు తీసుకునేందుకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్​ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తి చేశామని అంబులెన్సుల్లో స్వగ్రామానికి పంపించామన్నారు. గాయపడిన వారిని స్విమ్స్​, రుయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్​ అయ్యారన్నారు. రెండు, మూడు రోజుల్లో మిగతావారు కూడా కోలుకుంటారని వెంకటేశ్వర్లు తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం..
తిరుపతి తొక్కిసలాట ఘనటపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతిచెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి సంతాపం..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటనపై మంత్రులకు ఫోన్​ చేసి వివరాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 

వైఎస్​ ఆర్సీపీ..
మరోవైపు తొక్కిసలాట ఘటనపై వైఎస్​ఆర్సీపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఫైర్​ బ్రాండ్​ నాయకురాలు రోజా మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూ ఘటనపై రాద్ధాంతం సృష్టించిన వారు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆరుగురు చనిపోతే చీమకుట్టినట్లయినా లేదా? అని నిలదీశారు. లడ్డూ కల్తీ అసలు జరగనే లేదన్నారు. జగన్​ ప్రతిష్ఠను మసకబార్చాలనే ఉద్దేశ్యంతోనే ఈ అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఆరోపణలు చేసినవారంతా ఎక్కడికి వెళ్లారని దుమ్మెత్తిపోశారు.