ఒకే దేశం రెండు చట్టాలపై  శ్యామా ప్రసాద్​ ముఖర్జీ అలుపెరుగని పోరాటం

బలిదాన్​ దివస్​ లో నివాళులర్పించిన కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jun 23, 2024 - 15:29
Jun 23, 2024 - 21:08
 0
ఒకే దేశం రెండు చట్టాలపై  శ్యామా ప్రసాద్​ ముఖర్జీ అలుపెరుగని పోరాటం

నా తెలంగాణ, హైదరాబాద్​: దేశంలో రెండు చట్టాలు, ఇద్దరు ప్రధానాలు, రెండు జెండాలను వ్యతిరేకించి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానీయుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ అని రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ఆదివారం బలిదాన్​ దివస్​ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. నెహ్రూ దేశానికి ప్రధానిగా ఉండగా, జమ్మూకశ్మీర్​ లో షేక్​ అబ్దుల్లా ప్రధానిగా ఉన్నారన్నారు. ఇక్కడ అంబేద్కర్​ రాజ్యాంగం అమలువుతంటే, అక్కడ జిన్నా రాజ్యాంగం అమలయ్యిందన్నారు. ఇక్కడ భారతీయ జెండా ఉంటే, అక్కడ ప్రత్యేక జెండాను ఎగురవేసేవారన్నారు. ఈ విధానాన్నే శ్యామా ప్రసాద్​ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే’ అనే ఉద్యమం ద్వారా ఆయన పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. దీంతో ఆయనను జైలులో వేశారన్నారు. దేశం ఐక్యతగా ఉండాలన్న ఆయన పోరాటాన్ని కొనసాగిస్తూనే జైలులోనే ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పోరాట స్ఫూర్తి బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపిందని ఆయన కృషి వల్లే బీజేపీ ఏర్పాటయ్యిందన్నారు. దేశం కోసం బీజేపీ పార్టీ శ్రేణులు బలిదానాలకు వెనకాడవద్దని కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. సమాజ క్షేమం, ఐక్యత కోసమే ఆయన అలుపులేని పోరాటం చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే 75 ఏళ్ల తరువాత జమ్మూలో ఆర్టికల్​ 370ని రద్దు చేశామని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఆయన ఆశయాలను కొనసాగిస్తుందన్నారు. శ్యామా ప్రసాద్​ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్​ రెడ్డి ప్రార్థించారు.