శరీర రంగు చూసి అవమానిస్తారా?

కాంగ్రెస్​ దేశాన్ని విభజించాలని చూస్తోంది: మోదీ

May 8, 2024 - 16:56
 0
శరీర రంగు చూసి అవమానిస్తారా?
  • శ్యామ్​ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్​
  • రంగు ఆధారంగా వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా
  • శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి
  • దళిత బిడ్డ రామ్​ నాథ్​ కోవింద్​ ను రాష్ట్రపతిని చేశాం
  • గిరిజన బిడ్డ ముర్మును రాష్ట్రపతి చేస్తుంటే కాంగ్రెస్​ అడ్డుకున్నది
  • ఆమెను ఓడించాలని యత్నించింది
  • బీజేపీకి నేషన్​ ఫస్ట్​ అయితే.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కు ఫ్యామిలీ ఫస్ట్​
  • జరిగిన మూడు దశల ఎన్నికల్లో మాదే విజయం
  • కాంగ్రెస్‌ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి
  • ఇన్నాళ్లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి
  • తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్‌ విసురుతోంది
  • పీవీని కాంగ్రెస్​ అవమానిస్తే.. మేము భారత రత్నతో సన్మానించాం
  • వేములవాడ, వరంగల్​ సభల్లో ప్రధాని కామెంట్స్​

నా తెలంగాణ,/వేములవాడ/ వరంగల్‌: 

మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వరంగల్‌ పరిధిలోని మామునూరులో బుధవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా చేసిన ‘జాతి వివక్ష’ వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు.

గిరిజన వర్సిటీ ఇచ్చాం..

‘‘కాంగ్రెస్‌ పాలనలో రాజ్యాంగానికి ఎలాంటి రక్షణ లేదు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉన్నా కర్నాటకలో బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు ఇచ్చారు. ఎస్సీల విషయంలో ఆ పార్టీ వెనకడుగు వేసింది. దీనిపై నేనిచ్చిన వాగ్దానం నెరవేరుస్త. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశాం. రెండోసారి వచ్చాక ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఆ ఆదివాసీ బిడ్డను హస్తం పార్టీ వ్యతిరేకించింది. ఆమెను ఓడించాలని యత్నించింది. దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలని ఆ పార్టీ చూస్తోంది? చాలా మంది ప్రజల శరీర రంగు నలుపు ఉంటుంది. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన వేళ ప్రధాని ఈ విధంగా స్పందించారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోందని.. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తానెప్పటికీ సహించబోనని ప్రధాని హెచ్చరించారు.

భూతద్దంలో వెతకాల్సిని పరిస్థితి

‘‘కాంగ్రెస్‌ ఎక్కడ గెలుస్తుందో భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితి. ఆ పార్టీ హయాంలో రూ.వేల కోట్ల కుంభకోణాలు వెలుగుచూశాయి. ఇండి కూటమి ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను తీసుకువస్తామని చెబుతోంది. ప్రతి పార్టీకి ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా? రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మోసగించింది. రాష్ట్రంలో అ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోంది. అందులో ఒక భాగం హైదరాబాద్‌.. మరో భాగం ఢికి వెళ్తోంది’’ అని మోదీ దుయ్యబట్టారు.

వేములవాడలో ప్రధాని కోడె మొక్కులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు. సభ ప్రారంభానికి ముందు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి నేషన్‌ ఫస్ట్‌ అయితే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్‌. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్‌ ఇంత వరకు ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు” అని మోదీ ఆరోపించారు. 

పీవీని గౌరవించాం..

‘‘కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్‌ విసురుతోంది. కాంగ్రెస్‌ అతి కష్టం మీద కరీంనగర్‌లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్‌ పార్టీ ఎలా అవమానించిందో చూశాం. ఆయనను మేము భారతరత్నతో సన్మానించాం. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్‌లో కూడా సాధ్యం కాదు.మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్‌ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్‌లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్‌ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది” అంటూ ప్రధాని హాట్ ​కామెంట్స్‌ చేశారు.