ప్రధాని, మంత్రి, ఆర్బీఐ సిబ్బందికి శక్తికాంతదాస్ కృతజ్ఞతలు
పదవీ కాలం ముగియడంతో భావోద్వేగ పోస్ట్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తన పదవీకాలంలో ప్రభుత్వం, సహచరులు, వాటాదారులు సహరించడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారంతో ఆయన పదవీ కాలం ముగియడంతో సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టును పంచుకున్నారు. తన పదవీకాలంలో మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని ఆలోచనల ఉంచి తాను ప్రయోజనం పొందానన్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తన పదవీకాలంలో బలమైన ఆర్థిక-ద్రవ్య సమన్వయాన్ని నెలకొల్పేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేశారన్నారు. ఆమె మద్ధతు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో ఆర్థిక ద్రవ్య సమన్వయం భేషుగ్గా ఉందన్నారు. అనేక సవాళ్లను అధిగమించడంలో మంత్రి పాత్ర ఉందన్నారు.
అదే సమయంలో ఆర్థిక, వ్యవసాయం, సహకార, సేవా పరిశ్రమలతో సహా వివిధ రంగాలకు చెందిన వాటాదారుల నుంచి స్వీకరించిన పలు సూచనలు కూడా కీలకంగా నిలిచాయన్నారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లను స్వీకరించి సమర్థవంతంగా పరిష్కరించడంలో తనకు సహకరించిన ఆర్బీఐ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బీఐ విశ్వసనీయత సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఉన్నత స్థాయికి ఎదగాలని శక్తికాంతదాస్ ఆకాంక్షించారు.