చిన్నారులపై లైంగిక దాడి మహారాష్ట్రలో ఆందోళనలు
Sexual assault on girls is a concern in Maharashtra
పలు లోకల్ రైళ్ల రద్దు, రాళ్ల దాడులు
నిందితునిపై పోక్సో కింద కేసు నమోదు
ఉన్నతస్థాయి విచారణకు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఆదేశం
ముంబై: మహిళలు, బాలికలు, చిన్నారులపై రోజురోజుకు లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. కోల్ కతా దాడి ఓ వైపు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుండగా మహారాష్ర్టలోని ముంబై బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపుల కేసు ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఈ కేసులోనూ పోలీసులు, పాఠశాల, అధికారుల నిర్లక్ష్యం ఉదంటూ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగి ఏకంగా రైళ్లు నిలిపే వరకూ, రాళ్ల దాడుల వరకు వెళ్లడంతో విషయం మీడియాకు పొక్కింది.
వివరాల్లోకి వెళితే..
మహారాష్ర్ట థానేలోని బద్లాపూర్ పాఠశాలలో ఆగస్ట్ 12న లైంగిక దాడి ఘటన జరిగింది. ఆగస్టు 17న స్కూల్ అటెండర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిండర్ గార్టెన్‌లో చదువుతున్న మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను వేధిస్తున్నాడని ఆ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాల మరుగుదొడ్డిలోనే అటెండర్ బాలికలను వేధించాడని తెలిసింది. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. అనంతరం ఈ ఘటనపై ఫిర్యాదు నమోదు చేసి నిందితులపై పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రిన్సిపాల్‌తో పాటు క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను కూడా సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకుంది.
తల్లిదండ్రులు కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నా ఓ వైపు పోలీసులు, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తల్లిదండ్రులు, చుట్టుపక్కలు, పలు సంఘాలతో మమేకమై మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉదయం మహారాష్ర్టలోని పలు రైల్వే ట్రాక్ లపై బైఠాయించారు. పెద్ద ఎత్తున నిరసనకారులు చేరుకోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు లాఠీలు ఝాళిపించారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు రాళ్లదాడులకు పాల్పడ్డారు. ఈ ఆందోళనలతో పలు రైళ్లు కూడా రద్దయ్యాయి.
ప్రభుత్వం సీరియస్..
లైంగికదాడి ఆరోపణలపై ప్రభుత్వం దృష్టికి రావడంతో సీరియస్ గా స్పందించింది. వెంటనే ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ సిట్ విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన శిక్షలు పడేల కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకువెళ్లాలని థానే పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు.