సీఎం రేసులో ఏడుగురు
Seven people in CM race

ఢిల్లీ కమలదళానికి సారథి ఎవ్వరో?
దిగ్గజ నేతల సమావేశాలు
తొలి వరుసలో పర్వేశ్ వర్మ
పూర్వాంచల్ నాయకుడు మనోజ్ తివారీ
తొలి మహిళా సీఎంగా స్మృతి ఇరానీ ఎంపికయ్యేనా?
వీరేంద్ర సచ్ దేవాకు అవకాశం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఢిల్లీ ఎన్నికల్లో భారీ విజయం తరువాత సీఎం ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతుంది. తొలి వరుసలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు పర్వేష్ వర్మ ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీలోని చాలాఏళ్ల తరువాత విజయం సాధించడంతో సామాజిక వర్గాల సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. పూర్వాంచల్ నుంచి కూడా సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ సీఎం పీఠం ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై బీజేపీ అగ్రనేతలు పలువురు రాష్ర్ట నాయకులతో భేటీ అయ్యారు. రాజకీయ, కుల, మత, ప్రాంత సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ ఏకాభిప్రాయం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే సీఎం రేసులో ప్రముఖంగా ఏడుపేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.
పర్వేశ్ వర్మ..
కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ తొలి వరుసలో ఉన్నారు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. వరుసగా రెండుసార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి ఎంపీగా, 2019 ఎన్నికల్లో 5.78 లక్షల అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. కేజ్రీవాల్ ను ఓడించి తన సత్తా చాటారు. అయితే ఇక్కడ ఓ చిక్కు కూడా ఉంది. వర్మను సీఎం చేస్తే పూర్వాంచల్ ప్రజల ఆగ్రహానికి కూడా కారణం అయ్యే అవకాశం ఉండడంతో ఆచీతూచీ అడుగులు వేస్తుంది.
మనోజ్ తివారీ..
రెండో వరుసలో పూర్వాంచల్ నాయకుడు మనోజ్ తివారీ సీఎం పదవి రేసులో రంగంలో ఉన్నారు. ఈయన భోజ్ పురి నటుడు, గాయకుడు కూడా. ఢిల్లీ నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఒకవిధంగా చెప్పాలంటే పూర్వాంచల్ ఓట్లను బీజేపీ వైపు మలచడంలో ఈయన పాత్ర కీలకమైందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే ఈయనకు సీఎంగా ఎన్నిక చేయకుంటే పూర్వాంచల్ ప్రజల ఆగ్రహాన్ని బీజేపీ ఎలా చల్లారుస్తుందనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది.
మంజీందర్ సింగ్ సిర్సా..
మూడో నంబర్ లో మంజీందర్ సింగ్ సిర్సా పంజాబీ సిక్కు బలమైన నాయకుడు ఉన్నారు. 2013, 2017లో శిరోమణి అకాలీదళ్ టికెట్ పై రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. మూడోసారి రాజౌరి గార్డెన్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2021లో శిరోమణి అకాలీదళ్ ను వీడి బీజేపీలో చేరారు. 2023లో కేంద్రమంత్రి పదవికి ఎంపికయ్యారు. సిక్కు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అటు పంజాబ్, జాట్ లాంటి రైతు ఉద్యమాల నేపథ్యంలో కూడా ఈయనకు సీఎం పదవి వరించే అవకాశం లేకపోలేదు. దీంతో బీజేపీ సిక్కు సామాజిక వర్గంలో మరింత పట్టు సాధించే అవకాశం ఉంది.
స్మృతి ఇరానీ..
నాలుగో వరుసలో మధ్యప్రదేశ్ కు చెందిన స్మృతి ఇరానీ ఉన్నారు. 2010 నుంచి 2013 వరకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, 2011 నుంచి 2019 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2019లో రాహుల్ గాంధీని అమేథీ నుంచి ఓడించి ఎంపీగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా బీజేపీకి మహిళా విభాగంలో కీలక నేతగా పేరు పొందారు. ఈమెను సీఎం చేస్తే మహిళా వర్గాల్లోనే గాకుండా మైనార్టీల్లోనూ పార్టీ బలం మరింత పెంచుకునే అవకాశం ఉంది. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన వారు కావడం ఈమెకు మైనస్ గా మారనుంది. మరోవైపు బీజేపీలో ఇంతవరకూ మహిళా సీఎంలు ఎవరూ లేకపోవడం కూడా ఈమె సీఎం పదవి రేసులో ఉన్నారనేందుకు కలిసి వచ్చే అంశం కానుంది.
విజేందర్ గుప్తా..
ఐదో నంబర్ లో విజేందర్ గుప్తా ఉన్నారు. రోహిణి అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడోసారి ఎన్నికల్లో గెలిచారు. ఈ స్థానం ఆప్ కు కంచుకోటగా పేరున్నా విజేందర్ గుప్తా తన చరిష్మాతో బీజేపీ గెలిపించారు. బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఓబీసీ వర్గం నుంచి బలమైన నేతగా విజేందర్ గుప్తా పేరు పొందారు. ఈ నేపథ్యంలో ఈయనకు అవకాశం దక్కే సూచనలున్నా, అధిష్ఠానం అంత సాహసం చేస్తుందా? అనేదే ప్రశ్నార్థకంగా మారింది.
మోహన్ సింగ్ బిష్ట్..
మోహన్ సింగ్ బిష్ట్ ఆరో నంబర్ లో సీఎం అర్హతలున్న బలమైన నాయకుడుగా పేరు పొందారు. 1995 నుంచి 2015 వరకు వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2015లో ఓటమిపాలైనా, 2020లో తిరిగి విజయం సాధించారు. 2025లో బీజేపీ ఆయన్ను మైనార్టీలు ఎక్కువగా ఉన్న ముస్తాబాద్ నుంచి పోటీకి దింపింది. అయినా తన చరిష్మాతో 17వేల పైగా ఓట్లతో బీజేపీకి సునాయాసమైన గెలుపునందించారు. మైనార్టీల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ మోహన్ సింగ్ కు బలమైన నాయకత్వం, కార్యకర్తల బలం ఉంది. దీంతో ఈయన్ను కూడా బీజేపీ అధిష్టానం సీఎం పదవికి ఎంచుకునే అవకాశం ఉంది.
వీరేంద్ర సచ్ దేవా..
ఇక చివరి వరుసలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా సీఎం రేసులో ఉన్నారని పేరు వినిపిస్తున్నా, పర్వేశ్ వర్మ తరువాత ఈయన పేరే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ అధిష్ఠాన దిగ్గజ నేతల సూచనలు, సలహాలతో పార్టీని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, ప్రచార శైలిని ఎప్పటికప్పుడు నూతన పుంతలు తొక్కిస్తూ కమలం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. టికెట్ల కేటాయింపు సందర్భంగా అన్ని వర్గాలకు సమప్రాధాన్యత కల్పించడంలోనూ ఈయన కీలక పాత్ర వహించారు. 2007 నుంచి 2009 వరకు చాందినీ చౌక్ జిల్లా అధ్యక్షడిగా, 214 నుంచి 2017 వరకు మయూర్ విహార్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 నుంచి 2012 వరకు బీజేపీ రాష్ర్ట మంత్రిగా, 2012 నుంచి 2014 వరకు బీజేపీ ఇన్ చార్జీగా తదితర పదవులను నిర్వహించారు. 2023లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనతికాలంలోనే పార్టీని విజయం దిశగా నడిపించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అందుకే పర్వేశ్ వర్మ తరువాత ఈయన పేరే ప్రముఖంగా సీఎం పేరు వినిపిస్తుంది.