మంత్రివర్గ విస్తరణ? ఎవరికి ఏయే పదవులో?
నాలుగు శాఖలు బీజేపీ వద్దే శివరాజ్ సింగ్ చౌహాన్ కు అవకాశం మహిళల్లో ముందువరుసలో బాన్సూరి స్వరాజ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రిగా జూన్ 9వ తేదీ (ఆదివారం) నరేంద్రమోదీ పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని స్వయంగా ప్రధానియే రాష్ర్టపతిని కలిసిన తరువాత వెల్లడించారు. అయితే మంత్రి పదవుల పందేరంపైనే పలు ఊహాగానాలు వినబడుతున్నాయి. టీడీపీకీ–4, జేడీయూకు–3, ఎల్జేపీ, శివసేనలకు–2చొప్పున మంత్రి పదవులు దక్కనున్నట్లుగా భావిస్తున్నారు.
రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దే ఉండనున్నట్లు పార్ట వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంట్లో ఇటీవలే సమావేశమైన ఎన్డీయే పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు స్పీకర్ పదవిలో కూడా బీజేపీ పార్టీకి చెందిన వారే ఉండనున్నారు. ఇక గెలిచిన మంత్రులంతా యథాతథంగా తమ తమ శాఖల్లో ఉండే అవకాశం ఉంది.
ఇదే సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు పెద్ద పాత్ర లభించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా పీయూష్ గోయల్ కు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ శాఖలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మోదీ నూతన కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులకు చోటు దక్కే అవకాశం ఉంది. వీరిలో సుష్మాస్వరాజ్ కుమార్తె, ఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ మొదటి వరుసలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు మంత్రి పదవిని ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఒడిషా నుంచి అపరాజిత సారంగి, కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఎంపీ హెచ్ డీ కుమారస్వామికి కూడా మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి.