లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఐక్యరాజ్యసమితిలో రుచిరా కాంబోజ్
భారత్ లో లింగ సమనత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఇందుకోసం మూడింటి ఒకవంతు స్థానాలు మహిళలకు కేటాయించామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: భారత్ లో లింగ సమనత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఇందుకోసం మూడింటి ఒకవంతు స్థానాలు మహిళలకు కేటాయించామని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. మహిళా సాధికారతపై శనివారం యూఎన్ వోలో రుచిరా భారత భాగస్వామ్యంపై ప్రపంచదేశాలకు వివరించారు. అట్టడుగు స్థాయి నుంచి నేడు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా భారత్ అడుగులు వేస్తోందన్నారు. దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య 31 లక్షలని ఇందులో 14 లక్షల మందికి పైగా మహిళలే ఉన్నారని రుచిరా అన్నారు. అదే సమయంలో నాయకత్వంలో మహిళలు ఎదుర్కునే సవాళ్లు కూడా తక్కువేమి కాదని అంగీకరించారు. మహిళలకు మరింత చేయూత దక్కాల్సిన అవసరం ఉందని కాంబోజ్ తెలిపారు.
పంచాయతీ రాజ్ భారత్ లో మహిళల రాజకీయ భవితవ్యానికి, ఆర్థిక ఎదుగుదలకు ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో మహిళా నాయకత్వంలో పురోగతి సాధించిందని పేర్కొన్నారు.
నేడు దేశంలోని పంచాయతీరాజ్ వ్యవస్థను చూసిన పలు దేశాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. మహిళల్లోని ప్రతిభ, కృషిని వెలికితీసేందుకు ఇదో చక్కటి వేదికగా, అదే సమయంలో పరిపాలనా సౌలభ్యదాయకంగా గ్రామపంచాయితీలు నిలుస్తున్నాయని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు.