నెహ్రూ లేఖల పెట్టెలో ఏముందో?
What's in the Nehru letter box?
కాంగ్రెస్ ను నిలదీసిన బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర
51 పెట్టెల్లో దాగి ఉన్న మర్మం ఏంటి?
దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది
పీఎంఎంఎల్ అడిగినా ఇవ్వడం లేదెందుకు?
యూపీఏ చైర్ పర్సన్ గా ఉండగా సోనియా చర్యలకు ఉద్దేశ్యం ఏమిటి?
డిజిటలైజేషన్ కు ముందే తీసుకువెళ్లడంలో ఉద్దేశ్యం ఏంటి?
దేశ సంపదను బయటపెట్టరెందుకు?
కాంగ్రెస్ విధానాలు బయటపడతాయనే భయమా?
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మ్యూజియంలో ఉన్న నెహ్రూ లేఖల పెట్టేను సోనియాగాంధీ యూపీఏ చైర్ పర్సన్ గా ఉండగా ఎందుకు తీసుకువెళ్లారని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ప్రశ్నించారు. ఆ లేఖల్లో ఏం మర్మం దాగి ఉందన్నారు. నెహ్రూ పరిపాలనలో ఎన్నో దేశ, విదేశాలకు లేఖలు రాశారని ఆ లేఖల మతలబు దేశ ప్రజల ముందు ఉంచితే ఇబ్బంది ఏంటని నిలదీశారు. సోమవారం మీడియాతో సంబిత్ పాత్ర మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ లేఖల విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబం దేశ వ్యతిరేక చర్యలు తెలియకూడదనే ఆ లేఖల పెట్టెను మ్యూజియానికి తిరిగి అప్పగించడం లేదన్నారు. మ్యూజియం అధికారి అనేకమార్లు లేఖలు రాసినా ఎందుకు అప్పగించడం లేదో? చెప్పాలని నిలదీశారు.
ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) అధికారికంగా అభ్యర్థించినా, ఫోటో కాపీ అయినా ఇవ్వాలన్నా స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏంటని ప్రశ్నించారు. 51 పెట్టెల్లో నెహ్రూ ఎడ్వినా మౌంట్ బాటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయ్ లక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ మొదలైన గొప్ప వ్యక్తుల మధ్య సంభాషణలు ఉత్తర ప్రత్యుత్తరాలు కోరిన పత్రాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు. మ్యూజియం ఏజీఎం రాహుల్ గాంధీకి ఈ లేఖలను అందజేయాలని రాసినా అందజేయడం లేదని అన్నారు. లేఖలను పొందడం తమ విధి అని ఇవి ప్రజల ఆస్తులని అధికారి వాపోతుంటే కాంగ్రెస్ ఇంతవరకూ నిర్ణయం తీసుకోకపోవడం వెనుక దురుద్దేశ్యం ఉందన్నారు.
ఈ పత్రాల్లో నెహ్రూ ఎవరికి ఎం రాశారనేది ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. డిజిటలైజ్ కు ముందే పత్రాలు తీసుకువెళ్లేంత అవసరం ఏమొచ్చిందన్నారు. గాంధీ కుటుంబం చెప్పుకోదల్చుకోలేని అంశం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీకి వీటిని అందించి ఎందుకు వెనక్కు తీసుకున్నారో? చెప్పాలని డిమాండ్ చేశారు. నెహ్రూ మెమోరియల్ తొలుత తీన్ మూర్తి భవన్ గా వ్యవహరించేవారు. ఇందులోనే నెహ్రూ నివసించారు. నెహ్రూ మరణానంతరం ఆ భవన్ పేరును మార్చారన్నారు. ప్రస్తుతం ఇదే భవన్ ను పీఎంఎంఎల్ భవనంగా పిలుస్తున్నారు. ఇందులో ఉన్న పుస్తకాల ద్వారా దేశ చరిత్రతో ముడిపడి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వీటిని ఎందుకు దాచాలనుకుంటుందని నిలదీశారు. ఈ విలువైన సంపదపై పారదర్శకత, శాస్ర్తీయతతో కూడిన మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరమని అన్నారు.