వీసీల నియామకం..ఓయూలో ఏబీవీపీ ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వ దిష్ఠిబొమ్మ దగ్ధం శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమించాలని డిమాండ్
నా తెలంగాణ, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీ (వైస్ చాన్స్ లర్)లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో యూనివర్సిటీలో విద్యార్థుల నినాదాలు, పోలీసుల కు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.
నిరసన సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమించాలని అనేకసార్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. వీసీలు లేకపోవడంతో ఆయా యూనివర్సిటీల్లో విద్య, మౌలిక సదుపాయాల కల్పన పడకేసిందన్నారు. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమించాలని ఏబీవీపీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ (సీఎం రేవంత్ రెడ్డి) దిష్ఠిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ విద్యార్థులు దిష్ఠిబొమ్ము దహనం చేశారు.