రెండో‘స్సారీ’ కేజ్రీ పిటిషన్ తిరస్కరణ
వారానికి రెండు రోజులే న్యాయవాదులను కలిసే అవకాశం
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ వేసుకున్న పిటిషన్ ను మరోమారు కోర్టు తిరస్కరించింది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలవాలన్న డిమాండ్ ను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీంతో రెండోసారి సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలినట్లయింది. మంగళవారమే అరెస్టు అక్రమమంటూ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. వారానికి రెండుసార్లు మాత్రమే న్యాయవాదులను కలవొచ్చని కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్ తరఫున న్యాయవాది వివేక్ జైన్ వాదించారు. కేజ్రీవాల్ పై 35 నుంచి 40 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే న్యాయవాదులతో కనీసం వారంలో ఐదుసార్లయినా కలవాల్సి ఉంటుందని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సంజయ్ సింగ్ పై 5 నుంచి 8 కేసులు మాత్రమే ఉన్నా, మూడు సమావేశాలను అనుమతించారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న కోర్టు కేవలం రెండుసార్లకు మాత్రమే న్యాయవాదులను కలిసేందుకు అనుమతినీయడం గమనార్హం.