24 నియోజకవర్గాల్లో ఎన్నికలకు సమయం ఆసన్నం
ద్విముఖ పోటీయే?
సర్వేలకూ అంతుచిక్కని ఓటరు నాడీ?
అభివృద్ధికి పట్టమా? హింసకు నాందీ పలుకుతారా?
వెనుకబడ్డ ముఫ్తీ, ఫరూక్–కాంగ్రెస్ ల జోరు
మోదీ నేతృత్వంలో ప్రభావం చూపనున్న మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యూహాలు
శ్రీనగర్: హిమసీమ తొలి సమరానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా ఉగ్రదాడులు, కల్లోలానికి కేరాఫ్ గా ఉన్న జమ్మూకశ్మీర్ లో శాంతి, సుస్థిరతలను కేంద్రం నెలకొల్పగలిగింది. ఆర్టికల్ 370పైనే పలు పార్టీలు గంపెడాశలు పెట్టుకొని ప్రచారాన్ని నిర్వహిస్తూ తమ పార్టీ వైపు ప్రజలను తిప్పుకోవాలనే విస్తృత ప్రచారానికి తెరపడింది. మోహబూబా ముఫ్తీ (పీడీపీ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్సీ), కాంగ్రెస్, గులాంనబీ ఆజాద్ (డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ), స్వతంత్రులు అన్ని పార్టీలు బీజేపీని నేరుగా ఎదుర్కుంటున్నాయి. మరోవైపు బీజేపీ అభివృద్ధి, సుస్థిరత, శాంతి, సంక్షేమాలను నమ్ముకొని సింగిల్ గానే పోటీకి దిగింది. దశాబ్దకాలం తరువాత జరిగే ఈ ఎన్నికల్లో అనిశ్చితి తొలిగి జమ్మూకశ్మీర్ ప్రజల ఎవరికి పట్టం కడతారో? అన్నది సర్వేలకు కూడా అంతుపట్టడం లేదు.
మోదీ (బీజేపీ): మోదీ నేతృత్వంలోని బీజేపీ శాంతి, అభివృద్ధి, మహిళలు, రైతులు, పర్యాటక రంగం, యువత, క్రీడాంశాలు, ఉపాధి తదితరాలను పదేళ్లుగా పటిష్టపరిచి ఎన్నికలకు వెళుతుంది. అదే సమయంలో ఉగ్రవాదం, రాళ్లదాడులను పూర్తిగా నిరోధించగలిగింది. ఈ పార్టీ నేతృత్వంలోని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ చార్జీ తీవ్రంగా చెమటోడ్చారు. ఈయన ఆధ్వర్యంలో తొలివిడత జరగనున్న జిల్లాల్లో బూత్ స్థాయి సమావేశాల నుంచి భారీ చేరికలు నమోదయ్యాయి. అదే సమయంలో వ్యూహా ప్రతివ్యూహాలను కొనసాగించారు. ఏది ఏమైనా ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ప్రజల మైండ్ సెట్ లో బీజేపీ మార్పు తీసుకురాగలిగిందనేది వాస్తవం. ఈ నేపథ్యంలో బీజేపీ విజయానికి ఎంతో దూరంలో లేదన్నది స్పష్టమవుతోంది. అదే సమయంలో మెజార్టీగా ఉన్న ముస్లిం ఓటర్ల ఓట్లు ఈ రాష్ర్టంలో ప్రాధాన్యం చూపనున్నాయి. ఇదే బీజేపీకి కత్తిమీద సాములా పరిణమించే అవకాశం ఉంది.
మెహబూబా ముఫ్తీ (పీడీపీ): ఈ ఎన్నికల్లో తీవ్రంగానే చెమటోడ్చారు. ఆమె కూతురు ఇల్తీజా ముఫ్తీ కూడా ఈ సారి ఎన్నికల సమరంలో పాల్గొని విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఈమెకు ఉగ్రవాదానికి అనుకూలమనే ముద్ర పడింది. గతంలో ఉగ్రనాయకుల మరణాలపై పలుమార్లు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా అనేకమే ఉన్నాయి. ఆయా విషయాలను ప్రతిపక్షాలు లేవనెత్తుతూ పీడీపీని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో పీడీపీ ఇక్కడ విజయావకాశాలు దాదాపు గగనమే అని చెప్పాలి. ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురే మెహబూబా ముఫ్తీ ఆ ప్రాంతంలో అంతరూ ఈమెను ‘డాడీస్ గర్ల్’ అని కూడా పిలుస్తారు. గతంలో ఈమెకున్న ఇమేజ్ ప్రస్తుతం లభించడం లేదు.
ఫరూక్ అబ్దుల్లా (జెకేఎన్సీ): జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ఒకరు. బీజేపీ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని పున:సమీక్షిస్తామని, ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఇది శాంతికాముకులకు నచ్చకపోయినా నరనరానా ఇస్లామిక్ జీర్ణించుకుపోయిన వారికి మాత్రం ఈయన మాటలు బ్రహ్మపదార్థంలాగే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈయనతోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురుకానుందని సర్వేలు కూడా భావిస్తున్నాయి. ఇక్కడ ఫరూక్ అబ్దుల్లా మరో కీలక నిర్ణయం తీసుకోవడంతో పార్టీ మరింత పటిష్ఠం అయ్యాయనే వాదనలు వినబడుతున్నాయి. జేకేఎన్సీ–కాంగ్రెస్ తో చేతులు కలిపింది. అయితే తొలివిడత జరగనున్న ఎన్నికల్లో వీరికి లాభించనున్న స్థానాలపై మాత్రం వీరి కలయిక ఏ మేరకు ప్రభావం చూపనుందో తెలియదు. తొలివిడత వీరి ఓటర్ల ప్రభావమే మరో రెండు విడతల్లో కూడా వీరికి లాభిస్తుందా? లేదా? అన్నది తేలే అవకాశం ఉంది. ఏది ఏమైనా బీజేపీకి గట్టి పోటీ జేకేఎన్సీ–కాంగ్రెస్ లే. కాగా ఉగ్రభావ జాలంలో ముందుకు వెళుతున్న వీరిని ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక్కడ మరో అంశం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దశాబ్దాకాలంగా జైలులో మగ్గిన ఉగ్రనాయకుడు, ఇత్తెహాద్ పార్టీ చీఫ్ ఎంపీ షేక్‌అబ్దుల్ రషీద్ అలియాస్ (ఇంజనీర్ రషీద్) ఇటీవలే జైలు నుంచి విడుదలై అవసరం అయితే కూటమికే తన మద్ధతు అని బహిరంగంగా ప్రకటించాడు. ఇతను కూడా ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారిలో ఒకరు కావడం గమనార్హం.
జమ్మూకశ్మీర్ తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలు: పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనపోరా, షోపియాన్, డీహెచ్ పోరా, కుల్గాం, దేవ్‌సర్, డూరు, కోకెర్‌నాగ్ (ఎస్టీ), అనంత్‌నాగ్ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెరా, షాంగస్-అనంతనాగ్ తూర్పు, పహల్గాం, ఇందర్వాల్, కిష్త్వార్, పద్దర్-నాగ్సేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు.
మొదటి దశలో జరగనున్న ఎన్నికలకు ఏడు జిల్లాల్లోని 3276 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 302 అర్బన్ పోలింగ్ స్టేషన్లు, 2974 రూరల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ప్రిసైడింగ్ అధికారితో సహా నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. మొత్తంగా, తొలి దశ ఎన్నికల కోసం 14,000 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని విధులు నిర్వహిస్తున్నారు.
తొలిదశ ఎన్నికల్లో 23,27,580 మంది ఓటర్లుండగా 11,76,462 పురుషులు, 11,51,058 మహిళా ఓటర్లు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. 18–-19 సంవత్సరాల మధ్య వయస్సు గల 1.23 లక్షల మంది యువకులు, 28,309 మంది వికలాంగులు (పిడబ్ల్యుడిలు) మరియు 85 ఏళ్లు పైబడిన 15,774 మంది వృద్ధ ఓటర్లు కూడా మొదటి దశలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు.
ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. సమయం మించిపోయినా క్యూలో ఉన్న ఓటర్లకు అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.