రామేశ్వరం కేఫ్​ పేలుడు.. తలవెంట్రుకలతో నిందితుడి గుర్తింపు

పట్టుకునే పనిలో ఎన్ఐఏ.. పేలుడు ఐఎస్​ఐఎస్​ మాడ్యూల్ ​పనే అంటున్న ఎన్​ఐఏ

Mar 23, 2024 - 16:44
 0
రామేశ్వరం కేఫ్​ పేలుడు.. తలవెంట్రుకలతో నిందితుడి గుర్తింపు

బెంగళూరు: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్​లో పేలుడుకు పాల్పడ్డ ప్రధాన నిందితుడిని ఎన్​ఐఏ గుర్తించింది. వందల సీసీ కెమెరాలను జల్లెడ పోసిన అనంతరం వివిధ విశ్లేషణల తరువాత నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌గా గుర్తించినట్లు ఎన్​ఐఏ శనివారం మీడియాకు వెల్లడించింది. షాజిబ్​ కర్ణాటక తీర్థహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన వాడని ఎన్​ఐఏ వెల్లడించింది. నిందితుడు నెలరోజులుగా చెన్నైలోనే నివాసం ఉంటూ పేలుడుకు పలుమార్లు రెక్కీ చేసినట్లు ఎన్​ఐఏ అనుమానిస్తున్నది. నిందితుడి గుర్తింపుతో త్వరలోనే అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని సహచరుల్లో మరొకరు అబ్దుల్​ మతీన్​ తాహా అని ఎన్​ఐఏ వివరించింది. ఇతడు ఇన్​స్పెక్టర్​ హత్యకేసులో నిందితుడని గుర్తించినట్లు పేర్కొంది. శివమొగ్గలోని ఐఎస్​ఐఎస్​ మాడ్యూల్​లో వీరంతా భాగమని ఎన్​ఐఏ వివరించింది. నిందితుడు ధరించిన టోపీని కేఫ్​ నుంచి కొంతదూరంలో పడవేయగా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులోని వెంట్రుకలను ఫోరెన్సిక్​కు పంపినట్లు ఎన్​ఐఏ తెలిపింది. దీని డీఎన్​ఏ నమూనాలు షాజిబ్​ తల్లిదండ్రుల డీఎన్​ఏ నమూనాలతో సరిపోలాయని నిర్ధారించినట్లు పేర్కొంది. తల్లిదండ్రులు కూడా సీసీ టీవీ ఫుటేజ్​ ద్వారా షాజిబ్​ తమ కుమారుడేనని నిర్ధారించినట్లు స్పష్టం చేశారు.