కీలుబొమ్మ సర్కార్​ పైసా రాలక అగాధంలోకి

Puppet Sarkar's money is in the abyss

Oct 6, 2024 - 13:29
 0
కీలుబొమ్మ సర్కార్​ పైసా రాలక అగాధంలోకి
పసిగుడ్డును పెంచిపోషించిన భారత్​ పైనే విషం గక్కుతున్న బంగ్లాదేశ్​
మతిలేని చర్యలకు తలొగ్గిన తాత్కాలిక ప్రభుత్వం
ఉగ్రనాయకుల నిర్ణయాలకు పెద్దపీట
ఉపాధ్యాయుల బర్తరఫ్​ పాఠ్యాంశాల మార్పులు
చెయ్యిచ్చిన చైనా.. దిక్కులు చూస్తున్న బంగ్లా
పత్రికా స్వేచ్ఛ, మానవహక్కుల ఉల్లంఘనలు
కోరీ కష్టాలు తెచ్చుకున్న బంగ్లాదేశ్​
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:
మరో పాక్​ లా బంగ్లా మారబోతుందా? భారతీయులు, హిందూ సంస్కృతి, దేవాలయాలపై దాడులకు మూల్యం చెల్లించుకుంటుందా? తాత్కాలిక ప్రభుత్వం గద్దెనెక్కి ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే నాయకులే ఆ దేశ ఆర్థిక స్థితికి కారణమవుతున్నారా? ఏ మాత్రం అనుభవం లేని నరనరాన ప్రపంచానంతా మనమే ఏలాలన్న భూతాన్ని తలకెత్తుకున్న విద్యార్థి నాయకుల తొందరపాటు నిర్ణయాలకు తలొగ్గి యూనస్​ ప్రభుత్వం మతిలేని చర్యలకు దిగుతుందా? అంటే అవుననే చెప్పాలి. 
 
నోబెల్​ గ్రహీత ఆశయ సాధనలో విపలం..
జూలై లో బంగ్లాదేశ్​ సంక్షోభం, షేక్​ హసీనా రాజీనామా, దేశాన్ని విడిచిపెట్టి పోవడం, పాక్​, తాలిబాన్ల తలపించేలా హిందువులపై దాడులు యావత్​ ప్రపంచం గమనించింది. బంగ్లా స్వాతంత్ర్య పోరాటానికి భారత్​ చేసిన మేలు మరిచిపోయింది. అప్పటికప్పుడు తాత్కాలిక నోబెల్​ బహుమతి గ్రహీత యూనస్​ ను నియమించింది. కానీ ఆయన ఆశయ, పాలన సాధనలో తీవ్రంగా విఫలమవుతున్నది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక అగాధంలోకి వెళ్లిన బంగ్లా రేపోమాపో పాక్​ లా యుద్ధవిమానాలు, ఆ దేశ ఆస్థి పాస్తులు అమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
60 రోజులకే ఆర్థికంగా కుదేల్​..
ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాకు ఆర్థిక సహాయం చేసేందుకు కూడా ప్రపంచదేశాలు వెనకాడుతున్నాయి. 60 రోజులకే తాత్కాలిక ప్రభుత్వాల నిర్ణయాలు పెడదోవ పడుతుండడాన్ని యూఎన్​ గమనించి పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో చైనానూ నమ్ముకున్న బంగ్లా తప్పులో కాలేసింది. అసలే చైనానే వారి ఆర్థిక స్థితి బాగాలేక కొట్టుమిట్టాడుతోంది. చైనాలోని ప్రజలు ఆ దేశ కమ్యూనిస్టు పాలన, అసంతృప్తి నిర్ణయాలు, ఆర్థిక రంగం కుదేలుతో తీవ్ర ఆగ్రహం మీద ఉన్నారు. దీనికి తోడు సవాలక్ష కట్టుబాట్లతో అక్కడి ప్రజలు బంధనాల్లో బంధించబడ్డారు. ఇక చైనా ఏ విధంగా ఆర్థికంగా బంగ్లాను ఆదుకుంటుందని భావిస్తున్నారో? యూనస్​ ప్రభుత్వానికే తెలియాలి?
 
దుర్ణీతితో మొదటికే మోసం..
150 మంది వరకు ఉపాధ్యాయులను తొలగించడం, పాఠ్యపుస్తకాలన్నింటిలోని పాఠ్యాంశాలను పున: సమీక్షించడం, మార్చడం ఇస్లామిస్ట్​ పాఠ్యాంశాలే ఉండేలా రూపకల్పన చేయడం వెనుక భారత్​ ను ఇరకాటంలో పెట్టాలన్న దుర్ణీతి దాగి ఉందన్నది జగమెరిగిన సత్యం. ఆ దుర్ణీతితో తీసుకున్న నిర్ణయాల వల్ల బంగ్లానే ‘పైసా రాలక’ అగాధంలో కూరుకుపోయింది. 
 
ఉగ్రగ్రూపులకు తలొగ్గిన సర్కార్​..
బీజేఈ, బీకెఎం (బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ– బంగ్లాదేశ్ ఖిలాఫత్ మజ్లిస్) ఇతర ఇస్లామిక్ గ్రూపుల నిర్ణయాలకు క్రమేణా తలొగ్గుతూ 60 రోజుల్లోనే యూనస్​ ప్రభుత్వం తాము అదే దారిలో నడుస్తామని చెప్పకనే చెబుతోంది. ఢాకాలోని పత్రికా స్వేచ్ఛపై దాడులు, వ్యాపార, వాణిజ్య వర్గాలపై దాడులతో ఆ దేశంలో స్వేచ్ఛ, మానవహక్కులు, వ్యాపార రంగం ధ్వంసమైంది. కష్టాలు వద్దనుకుంటూనే కోరిమరీ కొని తెచ్చుకుంది.
 
బరితెగింపు దాడులు.. తీవ్రవాద నాయకులకు మంత్రి పదవులు..
దేశంలోని ప్రతిపక్ష పార్టీ నాయకులపై కూడా బరితెగింపు దాడులకు దిగింది. ఫలితంగా ప్రజాస్వామ్యం అనే మాటే బంగ్లాలో కనిపించడం లేదు. దీంతో ప్రజల్లో అసహానం, ఆందోళన, ఆగ్రహావేశాలు చెలరేగి బంగ్లా రెండు గ్రూపుల్లో సమిధ అయి నలిగిపోతోంది. యూనివర్సిటీల్లో నక్కి ఉన్న తీవ్రవాద సముహాలకే మంత్రి పదవులిచ్చి అందలమెక్కించడం కూడా ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. ఇదే షేక్​ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అక్కడ ప్రస్తుతం సమానత్వం, హక్కులు, స్వేచ్ఛ అన్న మాటలే లేవు. ఎక్కడ చూసినా ఇస్లామిస్ట్​ ఆలోచనలో ఫరిడవిల్లుతున్నాయి. దాడులు, దోచుకుతినడం, దొంగతనాలు పెరిగిపోవడం, పోలీస్​ స్టేషన్లు, భద్రతా బలగాలపై దాడులు అంతర్గతంగా కొనసాగుతున్నా యూనస్​ ప్రభుత్వం ఏమీ చేయలేని ‘కీలుబొమ్మ సర్కార్​’గా మారిపోయింది. 
వ్యవస్థీకృత రాజకీయ నిర్మాణం లేకపోవడంతో ప్రతీకార రాజకీయాలు, మత ధ్రువీకరణలు, కుల వివక్షలు అసమ్మతిని అణిచివేసే సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 
 
స్వాతంత్ర్యం సిద్ధించడంలో బంగ్లా వెంట నడుస్తూ ఆ దేశానికి అన్ని విధాలా సహాయకారిగా నిలిచి, పసిగుడ్డును పెంచిపోషించిన భారత్​ పైనే నేడు విషం గక్కుతోంది. ఏది ఏమైనా బంగ్లా మరో పాక్​, శ్రీలంకగా మారేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.