- జీఎస్ ఐటీఐలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
- సూర్యఘర్ తో గృహాలకు విద్యుత్
- ఇంధన సామర్థ్యం పెంపుపై నిబద్ధతతో పని
- 150 కిలోవాట్ 75 శాతం అవసరాలను తీరుస్తుంది
- ప్రతీయేటా రూ. 30 లక్షలు ఆదా
- వాతావరణం మెరుగుదలలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్
- నూతన శకానికి నాందీ
నా తెలంగాణ, హైదరాబాద్: పునరుత్పాదక ఇంధనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రోత్సహిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఇంధన ఉత్పత్తి వల్ల కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించగలుగుతామని స్పష్టం చేశారు.
ప్లాంట్ ప్రారంభంతో ముందడుగు..
శనివారం భాగ్యనగరంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (జీఎస్ ఐటీఐ)లో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ను మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎం.ఎస్. ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. స్థిరమైన శక్తిని ప్రోత్సహించడంలో ఈ ఇన్ స్టిట్యూట్ లో పవర్ ప్లాంట్ ప్రారంభంతో ముందడుగు పడిందని తెలిపారు. పునరుత్పాదకత ఇంధన శక్తి వాటాను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.
స్థిరమైన అభివృద్ధి..
సుస్థిర ఇంధనం కోసం నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. పర్యావరణం, ఇంధన సామర్థ్యం పెంపు, స్థిరమైన అభివృద్ధి వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మోదీ నేతృత్వంలో సౌరశక్తిని నేరుగా గృహాలకు అందించే సూర్యఘర్ వంటి పథకాన్ని ప్రారంభించామని పునరుద్ఘాటించారు. ప్రపంచంలోనే వాతావరణాన్ని మెరుగుపర్చుకునే చర్యల్లో భారత్ అగ్రగామిగా అవతరించిందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జీఎస్ ఐటీఐలో ఏర్పాటు చేసిన 150 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ 75 శాతం అవసరాలను తీరుస్తుందన్నారు. దీంతో ప్రతీయేటా రూ. 30 లక్షలు ఆదా అవుతుందని చెప్పారు. పునరుతాద్పక ఇంధన వినియోగంతో నూతన శకానికి నాందీ పలికామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, జిఎస్ ఐటీఐ అదనపు డైరెక్టర్ ఎస్. డి. పట్బాజే, అధికారులు తదితరులు పాల్గొన్నారు.