ఏడేళ్లలో డిజిటల్ లావాదేవీల వృద్ధి భారత్ పై ప్రశంసల జల్లు
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్
న్యూఢిల్లీ: భారత డిజిటల్ లావాదేవీల వాటా ప్రపంచంలోనే 60 శాతంగా ఉండడం అభినందనీయమని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. కేవలం ఏడేళ్లలోనే ఈ మేర డిజిటల్ లావాదేవీలలో లక్ష్యాన్ని సాధించడం ఆశ్చర్యకరమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామాజిక మార్పు, పురోగతికి చోదకశక్తి అని, దీనిని సమ్మిళిత మార్గంలో ఉపయోగించుకుంటే అందరికీ సమాన అవకాశాలను అందించగలదని పేర్కొన్నారు. ఈ మార్గంలో భారతదేశ పెరుగుదల ఒక అద్భుతమైన నిదర్శనమని డెన్నిస్ ఫ్రాన్సిస్ కొనియాడారు.
కేవలం ఏడేళ్లలో భారతదేశం తన పౌరులకు 80 శాతానికి పైగా ఆర్థిక సమ్మిళితాన్ని డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో సఫలీకృతం కావడం విశేషమన్నారు. ప్రపంచదేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జనవరిలో ఆయన భారత్ లో పర్యటించారు. ఈ సమయంలో, భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు విపరీతంగా విస్తరించాయని, ఇది ఇంతకు ముందు ఆర్థిక వ్యవస్థ వెలుపల ఉన్న మిలియన్ల మంది ప్రజలు డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ఆర్థిక స్వాతంత్ర్యం పొందడానికి దారితీసిందని ఆయన గుర్తించారు. ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో, సామాజిక పరివర్తన, పురోగతికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే అవసరమన్నారు.
డిజిటల్ లావాదేవీల విధానం అనేక సమస్యలను తొలగిస్తుందని అన్నారు. ఇది దేశ ఆర్థిక రంగానికి ఊతం ఇస్తుందన్నారు.
టెక్నాలజీ వినియోగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా మారిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అడ్మినిస్ట్రేటర్ అచిమ్ స్టెయినర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలివడం అభినందనీయమన్నారు.