Kishanreddy: మోదీ తెలంగాణకు 10 లక్షల కోట్లు ఇచ్చారు

Union Minister Kishan Reddy said that Modi has given 10 lakh crores for the development of Telangana in the last ten years

Mar 18, 2024 - 15:53
 0
Kishanreddy: మోదీ తెలంగాణకు 10 లక్షల కోట్లు ఇచ్చారు

నా తెలంగాణ, జగిత్యాల​: గత పది సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప సభలో కిషన్​ రెడ్డి మాట్లాడారు. ‘‘గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్రమోదీ దేశంలో అద్భుతమైన పాలన అందించారు. పేదవాడి ఇంటి నుంచి మొదలు.. చంద్రయాన్-3 వరకు ప్రపంచమే అబ్బురపడేలా నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ప్రజలకు సుస్థిరమైన, నీతివంతమైన పరిపాలన దేశానికి అందిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం వరకు మోదీ నాయకత్వంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో దేశంలోని అన్ని సమస్యలను పరిష్కరించారు. దేశంలో 25 కోట్ల మంది దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోదీదే. రాష్ట్రంలో అనేక జాతీయ రహదారులు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, జాతీయ పసుపు బోర్డు, గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులిచ్చారు. సమ్మక్క-సారక్క దేవతల పేరు మీద తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు”అని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్​ఎస్​
గత పది సంవత్సరాలు  కేసీఆర్ కుటంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నదని కిషన్​ రెడ్డి విమర్శించారు.‘‘తెలంగాణలో దోచుకున్నది చాలక కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేశారు. తెలంగాణ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుక్క తోక వంకర అన్నట్టుగా వాళ్ల అవినీతి కార్యక్రమాలను మళ్లీ ప్రారంభించారు.100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయకుండా తెలంగాణ  ప్రజలను మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం కావాలంటే నరేంద్రమోదీని మూడవసారి ప్రధానమంత్రి చేయాలి. మోదీ తెలుగు భాషను ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా ఆయన తెలుగు నేర్చుకుంటున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17కు 17సీట్లు గెలిపించాలని కోరుతున్నాను. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్రమోదీని ఆశీర్వదించండి”అని కిషన్​ రెడ్డి కోరారు.