లవ్ జిహాద్ సవరణ బిల్లుకు ఆమోదం
మతమార్పిడికి జీవిత ఖైదు
లక్నో: లవ్ జిహాద్ (సవరణ) బిల్లును యూపీ అసెంబ్లీ ఆమోదించింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం ఈ రకమైన నేరానికి పాల్పడితే జీవిత ఖైదును విధించనున్నారు. ఈ చట్టం కింద మతమార్పిడికి నిధుల వినియోగం కూడా నేరం పరిధిలోకి తీసుకువచ్చారు. ఏదైనా చట్ట విరుద్ధ సంస్థ నుంచి నిధుల ద్వారా అసాంఘిక కార్యకలాపాలను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చారు. మతం మార్చుకోవడం, ఒత్తిడి, దాడి, బలవంతం, పెళ్లి లాంటివి చేసిన వారందరిపై ఈ చట్టం వర్తించనుంది.
బిల్లు ప్రకారం బాధితురాలి చికిత్సకు, పునరావాసానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని జరిమానాగా విధించనున్నారు. మతమార్పిళ్లను అరికట్టేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.
ఈ చట్టం కింద ఎస్సీ, ఎస్టీ మహిళలను మతం మార్చేందుకు ప్రయత్నిస్తే ఐదు నుంచి 14 యేళ్ల జైలు శిక్ష, లక్ష వరకు జరిమానా విధించనన్నారు. సామూహిక మతమార్పిడికి పాల్పడితే 7 నుంచి 14యేళ్ల జైలు శిక్ష లక్ష వరకు జరిమానా విధించనున్నారు.
వికలాంగులు, మానసికంగా బలహీనంగా ఉన్న వారిని మతం మార్చుకునేలా ప్రేరేపిస్తే వారికి 5–14 యేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించనున్నారు. విదేశీ అక్రమ మార్పిడి నిధుల నేరాలపై 7 నుంచి 14యేళ్ల జైలు రూ. 10 లక్షల వరకు జరిమానాను విధించే అవకాశం ఉంది.