మణిపూర్​ శాంతికి ఆపరేషన్​ ‘ఆల్​ అవుట్​’

Operation 'All Out' for Manipur Peace

Nov 18, 2024 - 17:20
 0
మణిపూర్​ శాంతికి ఆపరేషన్​ ‘ఆల్​ అవుట్​’
4వేల మంది రంగంలోకి సీఆర్పీఎఫ్​ సిబ్బంది
వరంగల్​ బెటాలియన్​ కు కీలక బాధ్యతల అప్పగింత
ఆపరేషన్​ లో పాల్గొంటున్న లక్షమంది! 
కేబినెట్​ కీలక నిర్ణయాలతో చొరబాటుదారుల్లో వణుకు
సరిహద్దు ఫెన్సింగ్​, రోడ్ల నిర్మాణంలో పుంజుకున్న వేగం
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: మణిపూర్‌లో ఆపరేషన్​ ‘ఆల్ అవుట్’ షురూ చేశారు. ఈ ఆపరేషన్​ బాధ్యతలను సీఆర్పీఎఫ్​ కు అప్పజెప్పారు. నాలుగువేల మంది సీఆర్పీఎఫ్​ జవాన్లతో ఆపరేషన్​ ఆల్​ అవుట్​ ను చేపట్టనున్నారు. 
 
కేంద్ర ఇంటలిజెన్స్​ వర్గాల ద్వారా కేంద్రం పూర్తి సమాచారం సేకరించాక మణిపూర్​ లో శాంతికి ప్రయత్నించింది. అయినా పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఇక చొరబాటుదారులు, వారికి సహకరిస్తున్నవారు, ఉగ్రవాదులు, ఆయుధాలున్నవారి సమగ్ర చిట్టాను రూపొందించింది. మణిపూర్​ సరిహద్దులో ఇప్పటికే సరిహద్దు ఫెన్సింగ్​ ను ప్రారంభించింది. ఇది మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఆల్​ అవుట్​ ద్వారా మణిపూర్​ లో శాంతిని పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా తుది నిర్ణయానికి వచ్చారు. మోదీ అధ్యక్షతన ఇప్పటికే మణిపూర్​ శాంతి భద్రతలపై పలుమార్లు సమావేశమైన కేబినెట్​ ఇందుకు అంగీకరించడంతో ఇక చొరబాటుదారుల పనిపట్టనుంది. ఈ ఆపరేషన్​ ద్వారా కొండా కోనలు, సరిహద్దు ప్రాంతాలు, ఉగ్రవాదుల స్థావరాలు, వారికి సహకరిస్తూ ఆయుధాలను దాచి ఉంచిన ప్రాంతాలు ఇలా అన్నిచోట్లను ధ్వంసం చేయడం, అదుపులోకి తీసుకోవడం మాట వినని వారికి భద్రతాదళాల ద్వారా బుద్ధి చెప్పడం వంటి చర్యలను చేపట్టనున్నారు. 
 
ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ఆందోళనకారులు వదలకపోవడంతో ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి ఈ చర్యలకు దిగనుంది. హింసాత్మక చర్యలకు పాల్పడుతూ, ప్రజలను రెచ్చగొడుతూ దాడులకు దిగుతున్న వారి భరతం పట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే 2500మంది సీఆర్పీఎఫ్​ యాక్షన్​ ప్లాన్​ లో దిగింది. వీరికి అదనంగా మరో 1500మందిని రేపోమాపో మణిపూర్​ కు పంపనుంది. దీంతో పోలీసులతో కలుపుకొని భద్రతాదళాల సంఖ్య లక్ష దాటనుంది. 
 
నవంబర్​ 7 నుంచి మణిపూర్‌లో సుమారు ఇరవై మంది మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస, దహన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆగ్రహించిన ప్రజలు ముఖ్యమంత్రి, పది మంది ఎమ్మెల్యేల ఇళ్లను కూడా వదలలేదు. ఫలితంగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 14న ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సెక్మాయ్ మరియు లాంసాంగ్, ఇంఫాల్ ఈస్ట్‌లోని లామ్‌లై, బిష్ణుపూర్‌లోని మోయిరాంగ్, కాంగ్‌పోక్పిలోని లిమాఖోంగ్, జిరిబామ్ పరిధిలోని ప్రాంతాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం ‘ఎఫ్​ఎస్​పీఎ’ను  విధించింది. జిరిబామ్ జిల్లాలో అమలు చేస్తుంది. సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాల్ సింగ్ ఇప్పటికే మణిపూర్ చేరుకొని ఆపరేషన్​ ఆల్​ అవుట్​ కు శ్రీకారం చుట్టారు. 
 
సైన్యాన్ని మయన్మార్​ సరిహద్దు ప్రాంతాలకు తరలించారు. సోమవారం నుంచి యాక్షన్​ ప్లాన్​ కు సిద్ధమయ్యారు. ఆల్​ అవుట్​ ను వివిధ జోన్లుగా విభజించారు. జోన్ల వారీగా సైన్యాన్ని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలోని వరంగల్​ కు చెందిన ఓ బెటాలియను కూడా విధులు అప్పగించారు. వీరికే కీలక బాధ్యలను అప్పగించినట్లు తెలుస్తోంది. డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు, మానవరహిత వైమానిక దాడులకు ఈ బెటాలియన్​ కీలకం కానుంది. 
 
భారత్​–మయన్మార్​ సరిహద్దు పొడవు 1610 కి.మీ. ఇప్పటికే ఈ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందుకు కేంద్ర కేబినెట్​ కూడా ఆమోదముద్ర వేయడంతో పనుల్లో వేగం పుంజుకుంది. రూ. 31వేల కోట్లతో సరిహద్దు ఫెన్సింగ్​, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. సరిహద్దులో చొరబాట్లను నియంత్రించడంతోపాటు సైన్యాన్ని సులువుగా తరలించేందుకు, స్థానికుల అభివృద్ధి కోసం ఫ్​రీ మూవ్​ మెంట్​ మెకానిజం అనే సూత్రానికి కేబినెట్​ ఆమోదముద్ర వేసింది. 
 
సైన్యం రంగంలోకి దిగిన విషయం తెలుసుకున్న చొరబాటుదారులు, వారికి సహకరిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సైన్యం అనుమానిత ప్రాంతాలను చుట్టుముట్టి ప్రతీ ఇంటిలో సోదాలు కొనసాగించనుంది. స్థానికులు కాని వారిని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా అదుపులోకి తీసుకొని తిరిగి వెనక్కు పంపే మార్గం సుగమం కానుంది. దాడులకు దిగితే సైన్యం తమ పరిభాషలో బుద్ధి చెప్పనుంది. మొత్తానికి మణిపూర్​ శాంతికి కేంద్రం భారీ అడుగు వేసిందనే చెప్పాలి.