భారత్​ ను బద్నాం చేస్తారా?

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర

Nov 21, 2024 - 15:36
 0
భారత్​ ను బద్నాం చేస్తారా?
ఆరోపణల చరిత్ర కాంగ్రెస్​ ది
భారత్​ ఇమేజ్​ ను తగ్గించడం మీ తరం కాదు
రాహుల్​ వ్యాఖ్యలపై మండిపాటు
కేసు పెట్టరేందుకు, విచారణ కోరరెందుకు?
2021–2022లో ఆయా రాష్​ర్టాల్లో ప్రభుత్వాలెవ్వరివి?
రఫేల్​ పై ఆరోపణలు.. సుప్రీం ముందు క్షమాపణలు
భారత్​, మోదీ గౌరవాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవు
మార్కెట్లకు నష్టం వాటిల్లే చర్యలా?
తెలంగాణకు రూ. 100 కోట్లు విరాళం
రూ. 12500 కోట్ల పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి మీ పార్టీ కాదా?
వందలాది రాహుల్​ లు వచ్చినా భారత్​ అభివృద్ధిని అడ్డుకోలేరు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ, భారత్​ ఇమేజ్​ ను తగ్గించడం సోనియా, రాహుల్​, ప్రియాంక, కూటమి పార్టీల తరం కాదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర అన్నారు. గురువారం వేకువజామున 4 గంటల నుంచి భారత్​ ను బద్నాం చేసే ఆరోపణలకు రాహుల్​ గాంధీ అంకురార్పణ చేశారని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం సంబిత్​ పాత్ర రాహుల్​ ఉదయం చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. దీంతో కాంగ్రెస్​ పార్టీ నిజనిజాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నానికి మరోసారి సమాధానమిచ్చారు. 
 
అదానీ సంస్థకు సంబంధించిన అమెరికా కేసు 2021–2022 విద్యుత్​ సంస్థలకు సంబంధించినదన్నారు. అప్పుడు చత్తీస్​ గఢ్​, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు సంబంధం ఉందన్నారు. అప్పట్లో కాంగ్రెస్​ ప్రభుత్వాలే ఆయా రాష్​ర్టాల్లో అధికారంలో ఉన్నాయన్నారు. మీరు నిజనిజాలు నిజంగా ముందుకు రావాలనుకుంటే కేసు పెట్టి నిష్పక్షపాత విచారణను కోరాలన్నారు. అప్పట్లో కాంగ్రెస్​ హయాంలో ఉన్న వారి అందరి జేబుల్లోకి ఎంత డబ్బులు వెళ్లాయో చెప్పాలని నిలదీశారు. ఇలాగే గతంలోనూ రఫేల్​ పై ఆరోపణలు చేసి, నిజనిజాలు సుప్రీం ముందుకు వెళ్లేసరికి క్షమాపణలు చెప్పి తప్పించుకున్నారని సంబిత్​ పాత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ చరిత్రే ఆరోపణలదని, నిజాలది కాదని, తప్పించుకునే చరిత్ర వారిదన్నారు. 
 
ఓ వైపు ప్రధాని మోదీకి ప్రపంచదేశాలు రెడ్​ కార్పెట్​ తో స్వాగతం పలుకుతూ వారి దేశ అత్యున్నత గౌరవాన్ని అందిస్తుంటే అది చూసి ఓర్వలేక ప్రధాని గౌరవాన్ని మంటగలిపే చర్యలకు విదేశీ శక్తులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. భారత్​ ఆర్థిక వ్యవస్థ ఉవ్వెత్తున వెళుతుంటే ఇది చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. మోదీ–భారత్​ గౌరవాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని, తగ్గించలేవని తెలుసుకోవాలని రాహుల్​ ను హెచ్చరించారు. 
 
ఇలాన్​ ఉమర్​, జార్జ్​ సోరెస్​ లాంటి విదేశీ శక్తులతో కలిసి అంతర్జాతీయ కుటీల నీతికి తెరతీస్తూ భారత మార్కెట్లను కంట్రోల్​ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ రాహుల్​ గాంధీ చర్యలను సఫలం కానిచ్చేది లేదన్నారు. విచ్ఛిన్నకర పార్టీలు, వ్యక్తులతో కలిసి ఈయన చేసిన ఆరోపణలు, అవాస్తవాలు, అబద్ధాలు అన్నీ ఇన్నీ కావన్నారు. భారత్​ ఆర్థిక వృద్ధిలో మోదీ నేతృత్వంలో మూడో స్థానాన్ని సాధించే వరకు నిద్దుర పోదన్నారు. సోనియా, రాహుల్​, ప్రియాంక గాంధీలు చూస్తూనే ఉండిపోవాలన్నారు. వీరి వ్యాఖ్యల వల్ల భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడి 2.5 కోట్ల మందిపై పడిందన్నారు. వీరంతా భారతీయులు కాదా? అని రాహుల్​ ను నిలదీశారు. భారతీయులకే నష్టం వాటిల్లేలా చేసి వారి కోపాన్ని ప్రధాని (బీజేపీ)పై మలచి లబ్ధి పొందాలనే కుటీల నీతి ఇందులో దాగి ఉందన్నారు. 
 
చత్తీస్​ గఢ్​ లో 25వేల కోట్లు, రాజస్థాన్​ లో 65వేల కోట్లు, కర్ణాటకలో లక్ష కోట్ల రూపాయలు, బెంగాల్​ లో రూ. 35 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్​ లో రూ. 60 వేల కోట్లు పెట్టుబడులు అప్పట్లోనే పెట్టారని గుర్తు చేశారు. అప్పట్లో మీ ప్రభుత్వమే ఉందని మరీ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ఇటీవలే అదానీ సంస్థ తెలంగాణకు రూ. 100 కోట్లు విరాళం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ సంపదను పెంచుకునేందుకు సీఎం రేవంత్​ రెడ్డి అదానీ సంస్థల్లో రూ. 12,500 కోట్లు పెట్టుబడులు ఎందుకు పెట్టారని నిలదీశారు. కాంగ్రెస్​ పార్టీ (రాహుల్​), తెలంగాణ (సీఎం రేవంత్​ రెడ్డి)లు ఒకే పార్టీ వారు కాదా? అని నిలదీశారు. సీఎం రేవంత్​ రెడ్డి వరల్డ్​ఎకనమిక్​ ఫోరంలో కూడా సభ్యుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయా రాష్ర్టాల్లో నాయకులంతా మీ పార్టీ వారు కాదా? అని మండిపడ్డారు. 
 
రాహుల్​ గాంధీ తప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదని దమ్ము, ధైర్యం ఉంటే కేసులు పెట్టి విచారణ కోరాలని సవాల్​ విసిరారు. నిజనిజాలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సంబిత్​ పాత్ర డిమాండ్​ చేశారు. మీడియా, చట్టం ఎవరికి తొత్తులు కాదన్న విషయాన్ని రాహుల్​ గుర్తెరగాలన్నారు. కేవలం రెండు, మూడు ప్రశ్నలు అడిగితేనే సమాధానాలు లేక వారిపై మండిపడతారా? అని ప్రశ్నించారు. వీరు సమాజ శ్రేయస్సుకు పనిచేసేవారన్నారు. వీరి పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఏంటని నిలదీశారు. జవాబులు లేకుంటే లేవని, ఇవి కేవలం ఆరోపణలని చెప్పి ఉండాల్సిందన్నారు. అంతేకానీ మీడియాపై అంతెతున ఎగిసిపడడం ఎందుకని నిలదీశారు. 
 
పార్లమెంటరీ జాయింట్​ యాక్షన్​ కమిటీ (జేపీసీ)తో విచారణ చేపట్టాలని ప్రతీసారి డిమాండ్​ చేయడమే గానీ కేసు పెట్టి, విచారణ కోరే ధైర్యం కాంగ్రెస్​, రాహుల్​ లే ఎందుకు లేదని ప్రశ్నించారు. లోక్​ సభ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో భారత్​ ఇమేజ్​ ను తగ్గించాలని సమావేశాలు సజావుగా జరగనీయొద్దనే భావన పార్టీలో, ఆయనలో ఉందన్నారు. అందుకే సమావేశాలకు ముందు ఇలాంటి అంశాన్ని పసలేని ఆరోపణలను లేవనెత్తి బీజేపీని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తుంటారన్నారు. కానీ మోదీ నేతృత్వంలో భారత్​ మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ముందుకు వెళుతుందన్నది గుర్తుంచుకోవాలన్నారు. మీ లాంటి వందమంది రాహుల్​ లు వచ్చినా అభివృద్ధిని అడ్డుకోలేరని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర స్పష్టం చేశారు.