జమిలికి మెజార్టీ ఎంపీల మద్ధతు
ONOE majority MPs help
లోక్ సభలో ప్రవేశపెట్టిన మంత్రి మేఘ్వాల్
ఓటంగ్ కోరిన విపక్షాలు
జేపీసీకి పంపనున్న ప్రభుత్వం
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఎట్టకేలకు లోక్ సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి) బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. లోక్ సభ 17వ రోజు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను సవరించే బిల్లులను కూడా మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్- 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ- 1991, ది జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 ఉన్నాయి. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించేలా సవరణలు కూడా చేయవచ్చు.
అర్జున్ రామ్ మేఘ్వాల్: జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కొత్తది కాదు. 1983 నుంచి ఈ తరహా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఇది వ్యతిరేకం కాదు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదు. స్వీడన్, జర్మనీ వంటి దేశాల్లోనూ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ కోణంలోనే ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఈ ఎన్నికలు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎన్నికల సంఘం లోక్‌సభ, శాసనసభలకు 400 కంటే ఎక్కువ ఎన్నికలను నిర్వహించింది. ఇప్పుడు ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్‌ను తీసుకురాబోతున్నాం. ఉన్నత స్థాయి కమిటీ తన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఎన్నికల సంబంధిత ఖర్చులను తగ్గిస్తుంది, పాలసీ కొనసాగింపును ప్రోత్సహిస్తుంది.
జేపీసీకి పంపించేందుకు విపక్ష పార్టీల ఎంపీలు డివిజన్ కోరారు. దీంతో స్పీకర్ ఇందుకు అంగీకరించి ఈ ఓటింగ్ చేపట్టారు. ఈ ఓటింగ్ లో జమిలికి మద్ధతుగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ అనంతరం సభను మధ్యాహ్నం 3 గంటల వరకు లోక్ సభను వాయిదా వేశారు.
అమిత్ షా: ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని ప్రధాని మోదీ చెప్పారు. విపక్షాలు కూడా అదే కోరడం పట్ల తమకు అభ్యంతరం ఏమీ లేదు. జేపీసీ అభిప్రాయం తెలుసుకున్నాక ఒకసారి, కేంద్రం బిల్లును ఆమోదం తెలిపేముందు మరోమారు చర్చ కొనసాగిద్దాం. ప్రస్తుతం బిల్లును జేపీసీకి పంపాలి. దీంతో సమయం వృథా కాదు. ఎంపీలకున్న అనుమానాలు కూడా ఒకసారి నివృత్తి చేసినట్లవుతుంది.
ధర్మేంద్రయాదవ్ (ఎస్పీ): వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం.
అసదుద్దీన్ ఓవైసీ: బిల్లు వల్ల ప్రాంతీయ పార్టీలు నాశనమవుతాయి. ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లు పరోక్షంగా రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యాన్ని తీసుకువస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీల ఆశయాలకు విఘాతలం కలిగిస్తుంది. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నాం.
టీడీపీ (పెమ్మసాని చంద్రశేఖర్): ఒకే దేశం, ఒకే ఎన్నికలకు టీడీపీ మద్దతిస్తుంది. సరికొత్త ఆలోచనలకు సీఎం చంద్రబాబు మద్ధతిస్తారు. ఈ బిల్లుతో ఓటింగ్ శాతంలో కూడా పెరుగుదల ఏర్పడుతుంది. భారత అభివృద్ధికి, వికసిత్ భారత్ లో భాగస్వామ్యం అవుతూ.. వికసిత ఆంధ్రప్రదేశ్ కు బాటలు వేసుకుంటాం.
ఎంపీ టీఆర్ బాలు (డీఎంకే): ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలి.
టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ: జమిలి బిల్లు ఎన్నికల సంస్కరణ కాదు. ఒక వ్యక్తి ఆశయాన్ని నెరవేర్చుందుకు తీసుకువచ్చారు.
సుప్రియా సూలే: ఇది రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ పంపాలి. లేదా దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి.
శ్రీకాంత్ షిండే (శివసేన): ప్రతిపక్షాలకు సంస్కరణలంటే అలర్జీ. అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. దేశ ప్రగతితో ముడిపడిఉన్న బిల్లుకు తాము పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నాం.
ఎంపీ మనీష్ తివారీ: బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధం. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. మీరు అసెంబ్లీల పదవీకాలాన్ని తగ్గించలేరు. ఫెడరలిజం ప్రాథమిక సూత్రం రాజ్యాంగంలో కేంద్రం, రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయి.
శివసేన ప్రియాంక చతుర్వేది (ఉద్ధవ్ వర్గం): ఒకే దేశం, ఒకే ఎన్నికలు అధికారాన్ని కేంద్రీకరించడం లాంటిది. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన సత్తాను మరింత పెంచుకోవాలని భావిస్తుంది.