స్వేచ్ఛను కాలరాస్తున్న బంగ్లా పరిస్థితులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ లో స్వేచ్ఛా హక్కులను కాలరాసే చర్యలు దేశ విభజన సమయాన్ని గుర్తు చేస్తున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్ట్ 15 సందర్భంగా గురువారం సుప్రీంకోర్టులో భారత జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం చంద్రచూడ్ న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు.
చట్టాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు మంచిని, స్వేచ్ఛను సజీవంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.
దేశానికి సహాయం చేయాల్సిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. స్వాతంత్ర్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో భారతీయులు సమిథులుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని చిట్టచివరి ప్రజల వరకు కూడా సమాన న్యాయం అందించే గురుతర బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేశారు. బార్ కౌన్సిల్ లో మహిళా సభ్యుల కోసం నూతన కార్యాలయం నిర్మించడం సంతోషకరమన్నారు. తన 25యేళ్ల అనుభవంలో సామాన్యుల జీవితాలను సులభతరం చేయడం ఎలా అనే దానిపైనే పని చేశానని, మహిళల గౌరవం కాపాడడం మన సంస్కృతిలో భాగమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.