భౌగోళిక రాజకీయంలో ఈశాన్య రాష్ట్రాలు కీలకం
దేశాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం అష్టలక్ష్మీ మహోత్సవ్ లో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భౌగోళిక రాజకీయ క్రమం గ్లోబల్ సౌత్, ఈశాన్యం వైపు మళ్లుతుందని కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. న్యూ ఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న అష్టలక్ష్మీ మహోత్సవ్ లో శనివారం పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలు క్రమేణా దేశ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యాన్ని పోషిస్తాయన్నారు. పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన, చేతి ఉత్పత్తులు ఆయా రాష్ర్టాల ప్రత్యేకతలు మెరుగుపడి ప్రపంచానికి అందించేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందన్నారు. నిజమైన అభివృద్ధి కోసం, రాష్ట్రాలు తమను తాము భాగస్వాములుగా భావించాలని, కేంద్రంతో పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కోరారు. రాబోయే రోజుల్లో త్రిపుర, న్యూఢిల్లీలో పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశాలతో పాటు భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా రోడ్‌షోలతో, ఈ ప్రాంతం పటిష్టమైన ఆర్థిక వృద్ధికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు.