వ్యాధులను ముందే తెలుసుకోవచ్చు!
యేటా ప్రపంచవ్యాప్తంగా దోమకాటుతో ఆరు లక్షల మంది మృతి
భారత్ లో 77 శాతం దోమకాటు కేసులు నమోదు
కిమ్ కి తెలిస్తే ప్రమాదమే అంటూ సోషల్ మీడియాలో పేలుతున్న ఛలోక్తులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఏ దోమ ప్రమాదకరమైనదో తెలిపే యాప్ ‘వెక్టర్ కామ్’ ను అమెరికా జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీలోని బయో ఇంజనీర్ల బృందం, ఉగాండాలోని మాకేరీ యూనివర్సిటీ, గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి రూపొందించారు. ఈ యాప్ ద్వారా మీకు కుట్టిన దోమ ఫోటోతో ఆ దోమ ప్రమాదకరమైందో కాదో? తెలిసిపోనుంది. పరిశోధకులు ఈ వినూత్న టెక్నాలజీని కనిపెట్టడంతో మలేరియా, డెంగ్యూ, దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వ్యాధులను ముందే కనిపెట్టొచ్చన్నమాట. దీంతో ఈ దోమలు కుడితే ముందే మేల్కొని చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
అన్నట్లు ఈ విషయం గనుక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు తెలిస్తే అక్కడ ఆయా వ్యాధులతో ఎవ్వరూ చనిపోయినా ఈ యాప్ ద్వారా ఎందుకు కనిపెట్టలేకపోయారని ఉరిశిక్షలు వేసే ప్రమాదం ఉందని సామాజిక మాధ్యమాల్లో ఛలోక్తులు పేలుతున్నాయి.
బయో శాస్ర్తవేత్తలు ప్రపంచానికి పరిచయం చేసిన ఈ యాప్ భవిష్యత్ లో ఆయా రోగాలను దరిచేరకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంలో కీలకంగా మారనుండడం విశేషం.
ప్రతీ యేటా ప్రపంచవ్యాప్తంగా దోమలు కుట్టడం వల్ల 30 నుంచి 50 కోట్ల మందికి వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇందులో ఆరు లక్షల మంది చనిపోతున్నారు. 90 శాతం కేసులో కేవలం ఆఫ్రికా దేశాల్లోనే నమోదవుతున్నాయి. దక్షిణాసియాలో 77 శాతం కేసులు భారత్ లో నమోదవుతున్నాయి. భారత్ లో ప్రతీయేటా 1.5 కోట్ల మంది మలేరియా బారిన పడుతుండగా 20వేల మంది మృత్యువాత పడుతున్నారు.
డెంగ్యూ– ఎడిస్ ఈజిప్ట్ దోమ: ఈ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ సంక్రమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ యేటా 10 నుంచి 40 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 36వేల మంది చనిపోతున్నారు. 80 దేశాల్లో ఈ దోమకాటు ప్రభావానికి గురవుతున్నాయి.
దోమల యాప్ ను సృష్టించడం ఇదే మొదటిది సారి కాదు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు కూడా ‘హమ్ బగ్’ అనే యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా దోమలను 10 సెంటీమీటర్ల దూరం నుంచే గుర్తించవచ్చు. ఈ యాప్ దోమల రెక్కల శబ్ధం కూడా వింటుందట మరీ!
ఏది ఏమైనా యాప్ ల పుణ్యమా అని మలేరియా, డెంగ్యూ లాంటి ఇతర వ్యాధులు దూరం అయితే బెటరే కదా!