చార్ ధామ్ కు పది లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు!
చార్ ధామ్ యాత్రపై విపరీతమైన రద్దీ నెలకొనేటట్లుగా ఉంది. శనివారం ఉదయం వరకు ఈ యాత్రకు పది లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికార వర్గాలు వివరించారు.
డెహ్రాడూన్: చార్ ధామ్ యాత్రపై విపరీతమైన రద్దీ నెలకొనేటట్లుగా ఉంది. శనివారం ఉదయం వరకు ఈ యాత్రకు పది లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికార వర్గాలు వివరించారు. బ్రదీ–కేదార్ నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు యాత్రికుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కేదార్ నాథ్ కు మూడున్నర లక్షల మందికి పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభించి కేవలం ఐదు రోజుల్లోనే ఇంతమంది భక్తులు పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ఈసారి భక్తుల నమోదు రికార్డు స్థాయిలో ఉండేట్లుగా ఉందని అధికారులు వివరించారు.
ఈ ఏడాది కూడా ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్‌కు రికార్డు స్థాయిలో యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా పర్యాటక శాఖ నిర్వహిస్తున్న చార్‌ధామ్ యాత్రకు ఐదు రోజుల్లోనే 10.66 లక్షల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. గతేడాది 56 లక్షల మంది యాత్రికులు చార్ ధామ్ యాత్రను చేపట్టి రికార్డు సృష్టించడం గమనార్హం. ఈసారి దానికి మించి రావచ్చనే అంచనా నెలకొంది. గంగోత్రి, యమునోత్రి తలుపులు మే 10న తెరుచుకోనున్నాయి.